రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ఉత్తరాది రాష్ట్రాలను తలపిస్తుంది. గత రెండు రోజులుగా భద్రాచలం ఏజెన్సీలో చలి తీవ్రత అధికమవడంతో పాటు పొగ మంచు సైతం కొనసాగుతుంది. జనవరి మొదటి వారం నుంచి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు.
ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో జనజీవనం స్తంభించిపోతుంది. అలాగే మధ్యాహ్నం మూడు గంటల నుంచి చలి తన ప్రభావాన్ని చూపుతుంది. దీంతో శీతల వాతావరణ ప్రభావంతో మన్యం వాసులు గజగజలాడుతున్నారు. ఇదిలా ఉండగా పొగముంచు అందాలతో భద్రాద్రి పట్టణం ఆహ్లాదకరమైన సుందర దృశ్యాలను ఆవిష్కృతం చేస్తుంది.
పక్క మనిషిని గుర్తుపట్టలేనంత మంచు దుప్పటితో ఈ ప్రాంతం ముసుగేసింది. పొగ మంచు తప్పించుకునేందుకు సూర్యకిరణాలు భూమికి తాగడానికి ఉదయం 9 గంటల వరకు వెసులుబాటు లేకపోయింది.తెల్లవారింది మొదలు జీవన ప్రయాణం సాగించడానికి ప్రయాసలు పడే వారంతా ఈ మంచు పొరలు తప్పించుకొని వెళ్లడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ముఖ్యంగా గత రెండు రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రోడ్లపై చట్టమైన పొగ మంచు కమ్మేస్తుంది. ఈ నేపథ్యంలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దారి కనిపించకపోవడంతో కొంతమంది రోడ్డు పక్కనే వాహనాలు నిలిపేస్తున్నారు. ఇదిలా ఉండగాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిసర ప్రాంతాల్లో మరింత తీవ్రంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గిరిజన గ్రామాలు వణికిపోతున్నాయి.
రాత్రి, ఉదయం సమయాల్లో కంటే తెల్లవారుజామున అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటవీ ప్రాంతం కావడంతో చలికితోడు పొగమంచు సమస్య తీవ్రంగా ఉంది.రోడ్డుపై పొగమంచు కమ్ముకోవడంతో 15 విూటర్లకు మించి కనిపించడం లేదు. దీంతో ఉదయం 7 గంటల వరకు వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
గత సంవత్సరంతో పోల్చుకుంటే వాతావరణంలో ఈ సారి మార్పులు కనిపిస్తున్నాయి. వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతేకాకుండా ప్రతి రోజూ ఉదయం వేళల్లో పనులపై బయటికి వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయాన్నే పాల వ్యాపారులు, పేపర్ బాయ్స్ చలిలో వణుకుతూనే పనులు చేసుకుంటున్నారు.
సూర్యోదయం అయినా పొగమంచు వీడడం లేదు. దీంతో స్వెట్టర్లు, ఇతరత్రా ఉన్ని దుస్తులు ధరించి బయటికి వస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలిలో బయటికి రావడానికి జంకుతున్నారు. అస్తమా వ్యాధి గ్రస్తులపైనా చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా జనం ఉదయం పూట చలిమంటలు వేసుకుంటున్నారు. ఉత్తర భారతం నుంచి వీచే అతి శీతల పవనాలు జిల్లాను తాకడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సైతం కనిష్ఠంగా నమోదవుతున్నాయి. ఫిబ్రవరి మాసం మొదటివారం వరకు చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Local News, Telangana