హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: యుద్ధ వాతావరణం తలపించిన పోడు పోరు., అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య బాహాబాహీ 

Bhadradri: యుద్ధ వాతావరణం తలపించిన పోడు పోరు., అటవీ సిబ్బంది, గిరిజనుల మధ్య బాహాబాహీ 

భద్రాద్రిలో

భద్రాద్రిలో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) లో మరోమారు పోడు వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. అటవీ భూముల పరిరక్షణలో భాగంగా అడవిలోని బీడు భూముల్లో అటవీశాఖ సిబ్బంది మొక్కలు పెంచుతుండగా ఆ భూముల్లో పోడు చేస్తున్నామంటూ కొందరు గిరిజనులు ఎదురు తిరిగారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Bhadrachalam, India

  Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) లో మరోమారు పోడు వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. అటవీ భూముల పరిరక్షణలో భాగంగా అడవిలోని బీడు భూముల్లో అటవీశాఖ సిబ్బంది మొక్కలు పెంచుతుండగా ఆ భూముల్లో పోడు చేస్తున్నామంటూ కొందరు గిరిజనులు ఎదురు తిరిగారు. ఈక్రమంలో అటవీశాఖ సిబ్బంది, పోడు గిరిజనుల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఇరు వర్గాల ఘర్షణతో ఏజెన్సీ ఏరియాలో యుద్ధ వాతావరణం తలపించింది. దీంతో గత కొన్ని రోజులుగా సద్దుమణిగిందనుకున్న పోడు వ్యవహారం తిరిగి రాజుకుంది. భద్రాద్రి జిల్లాలో పలు మండలాల్లో పోడు రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య వివాదం ముదురుతోంది. పోడు భూముల్లో ప్లాంటేషన్ పేరుతో అటవీశాఖ అధికారులు ఏడాది క్రితం మొక్కలు నాటారు. గడిచిన రెండు రోజులుగా ప్లాంటేషన్ మొక్కల్ని పోడు గిరిజనులంతా తొలగించి అరకలతో దున్నే ప్రయత్నం చేయగా అటవీశాఖ సిబ్బంది కలగజేసుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది.

  అశ్వారావుపేట మండలం తిరుమలకుంట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని బండారుగుంపు బీట్లో ఉన్న దాదాపు 10 హెక్టార్ల పోడు భూములను ఏడాది క్రితం దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారులు స్వాధీనం చేసుకుని సుమారు రూ. 10 లక్షల వ్యయంతో ప్లాంటేషన్ వేశారు. అయితే శనివారం అశ్వా రావుపేట మండలం బండారుగుంపు, పాతరెడ్డిగూడెం, దమ్మపేట మండలం అంకంపాలెం గ్రామాలకు చెందిన 20 మంది గిరిజనులు తాము గత ఇరవై ఏళ్లుగా ఈ భూమిలో సాగు చేసుకుంటున్నామని తెలుపుతూ అందులో వేసిన మొక్కలను తొలగించి అరకలతో దున్నేందుకు యత్నించారు.

  ఇది చదవండి: రైతు బజార్లో కూరగాయలు అమ్ముతున్న విద్యార్థులు.., ఎందుకో తెలుసా..?

  విషయం తెలుసుకున్న దమ్మపేట ఫారెస్ట్ రేంజర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల నుంచి ఫారెస్ట్ సిబ్బంది, స్థానిక ఎస్సై చల్లా అరుణతోపాటు పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో మొహరించి గిరిజనులను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో వెంకటమ్మ అనే ఓ గిరిజన మహిళ స్పృహ తప్పి పడిపోగా, మరో ఇద్దరు గిరిజనులకూ, అశ్వా రావుపేట ఫారెస్ట్ రేంజర్ అబ్దుల్ రెహమాన్ కు స్వల్ప గాయాలయ్యాయి.

  ఇది చదవండి: ఇకపై ఆర్టీసీ బస్సులో కండక్టర్ కనిపించడేమో.., కారణం ఇదే..!

  ఈ వివాదం గురించి తెలుసుకున్న ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు సరియం కోటేశ్వరరావు, పాయం దుర్గారావుతో పాటు మరికొందరు నాయకులు పోడు భూముల వద్దకు చేరుకుని పోడు సాగుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో దమ్మపేట ఫారెస్ట్ రేంజర్, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కలిసి దాదాపు రెండు గంటల పాటు చర్చలు నిర్వహించారు.

  ఈ చర్చల్లో రేంజర్ మాట్లాడుతూ శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2012లో పోడు నరికినట్లు కనిపిస్తోందని, అటవీ హక్కుల చట్టం వర్తించదని స్పష్టం చేశారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు మాట్లాడుతూ స్థానిక గిరిజనులు ఈ భూములను 2002 నుంచి సాగు చేస్తున్నారని, ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల్లో గిరిజనులు సాగుచేయకుండా అడ్డుకోవడం తగదన్నారు. ఈ భూములపై 2002లోనే పోడు నరికిన గిరిజనులపై కేసులు నమోదు చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు అధికారి వివరించారు. పోడు వ్యవహారంలో 140 జీఓపై అక్టోబర్ 21వ తేదీన న్యాయస్థానం స్పష్టత ఇస్తుందని, అప్పటి దాకా పోడు భూముల్లోకి రావొద్దని ఇరువర్గాలు నిర్ణయించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Bhadradri kothagudem, Local News, Telangana

  ఉత్తమ కథలు