హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: రైలు పునరుద్ధరించాలని వేడుకుంటున్న ప్రజలు

Bhadradri Kothagudem: రైలు పునరుద్ధరించాలని వేడుకుంటున్న ప్రజలు

రైళ్లను పునరుద్ధరించాలని వినతి

రైళ్లను పునరుద్ధరించాలని వినతి

Telangana: కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో రద్దయిన మణుగూరు -కొల్హాపూర్, మణుగూరు కాజీపేట రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు రైల్వే శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Kranthi Kumar, News 18, Bhadradri

కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో రద్దయిన మణుగూరు -కొల్హాపూర్, మణుగూరు కాజీపేట రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు రైల్వే శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్ -19 తరువాత సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ సమయంలో రద్దు అయిన రైలును పునరుద్ధరించే విషయంలో రైల్వే శాఖ అధికారులు అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని జిల్లా వాసులు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు ఎంతో కీలకమైన రైళ్లు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఉండగా త్వరలోనే హదప్సర్ (పుణే) - హైదరాబాద్ రైలును కాజీపేట వరకు పొడిగిస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో వరంగల్ పరిసర ప్రాంత సాఫ్ట్వేర్ ఉద్యోగులు నేరుగా రైలు మార్గం ద్వారా పుణేకు వెళ్లే అవకాశం కలిగింది.

ఇదే తరహాలో మణుగూరు -కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ రైలును కూడా పునరుద్ధరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్నారు. వీరిలో సగానికి పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న గచ్చిబౌలి, మాదాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో ఉంటున్నారు. కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ - బేగంపేట - లింగంపల్లి స్టేషన్ల మీదుగా ప్రయాణించేది. దీంతో జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇంటి సమీపానికి చేరుకునే వీలు ఉండేంది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించినప్పుడు 2020 మార్చిలో మణుగూరు-కొల్హాపూర్ రైలు రద్దయింది. మూడు నెలలు తక్కువ మూడేళ్లు కావొస్తున్న రైల్వే శాఖ ఈ రైలును పునరుద్ధరించే విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం నుంచి రాష్ట్ర రాజధానికి రెండు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మణుగూరు ఎక్స్ప్రెస్ రాత్రి 10 గంటల 50 నిమిషాలకు బయల్దేరి తెల్లవారుజామున 3:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తెల్లవారుజామున రాష్ట్ర రాజధానిలో లోకల్ బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ఎంఎంటీఎస్ రైలు కోసం తెల్లవారు జామున గంటకు పైగా వేచి ఉండాల్సి వస్తోంది. లేదంటే వ్యయప్రయాసలకోర్చి క్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే రైలును లింగంపల్లి వరకు పొడిగిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఎంతో అనువుగా ఉంటుంది.

మరోరైలు కొత్తగూడెంలో ఉదయం 5 గంటలకు బయల్దేరి 11 గంటల సమయంలో సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఆ సమయంలో హెవీ ట్రాఫిక్ ఉండటంతో నగరంలోని గమ్యస్థానాలను చేరుకునేందుకు మరో రెండు గంటలకు పైగా సమయం అదనంగా పడుతోంది. వెరసి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు రైళ్లు సాధారణ ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాసాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలను తీర్చలేకపోతున్నాయి. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు రైళ్ల కంటే బస్సులనే ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. కొల్హాపూర్ రైలు రద్దయిన తర్వాత హైదరాబాద్ వెళ్లే ప్రైవేటుబస్సులకు డిమాండ్ పెరిగింది.

ఇదిలా ఉండగాకరోనా సమయంలో రద్దయిన మణుగూరు కాజీపేట రైలుకు అసలు మళ్లీ నడుస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. సింగరేణి కార్మికుల కుటుంబాలు తమ సొంతూళ్లు ఉండే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు వేములవాడ వంటి పుణ్యక్షేత్రాలను చేరుకునేందుకు ఈ రైలు ఉపయోగపడేది. ఉదయం మణుగూరులో బయల్దేరే ఈ రైలు 8 గంటలకు కొత్తగూడెం చేరుకుని మధ్యా హ్నం 12:30 గంటల సమయంలో వరంగల్ చేరుకునేది.

రోడ్డు మార్గం కంటే త్వరగా అతి తక్కువ ఖర్చుతో ప్రయాణం పూర్తయ్యేది. అయితే ఈ రైలును పునఃప్రారంభించే విషయంలో రైల్వే శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించిన రేక్ షేరింగ్ కాంబినేషన్ సైతం పూర్తిగా మారిపోయింది. దీంతో మణుగూరు ప్యాసింజర్ అసలు పట్టాలు ఎక్కుతుందా అనేది సందేహంలో పడిపోయింది. ఇక రద్దయిన డోర్నకల్ -భద్రాచలం రోడ్ ప్యాసింజర్ను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తిరుపతి , షిర్డీ వంటి పుణ్యక్షేత్రాలకు రైళ్లను నడిపించాలనే డిమాండ్ అధికంగా ఉంది.

కొత్త రైళ్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సింది పోయి పాత రైళ్లకు ఎసరు పెడుతోంది రైల్వేశాఖ. గతంలో ప్యాసింజర్ రైళ్లుగా ఉన్న సింగరేణి, కాకతీయ(ఉదయం సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ కు నామ మాత్రంగా కొన్ని స్టాపులను తొలగించి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ సౌకర్యాలు, సమయ పాలన పాటించడంలో ఈ రైళ్లు ఇంకా ప్యాసింజర్లనే తలపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తేనే పాత రైళ్ల పునరుద్ధరణతోపాటు కొత్త రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana, Train

ఉత్తమ కథలు