రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాచలం
ఢిల్లీ తరహాలో ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి చేయాలని విద్యాశాఖ మరింత పటిష్ట పరచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగా పలు నూతన పథకాలను ఆవిష్కరిస్తూ, అమలు పరుస్తూ ముందుకు పోతుంది. ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను పునరుద్ధరణ, మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా మన ఊరు మనబడి కింద పాఠశాలలను బాగు చేస్తున్నారు అధికారులు. ఇలా ఉండగా ఇటు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం పలు కార్యక్రమాలు సైతం రూపొందించింది. అందులో భాగంగా ఇటీవల కాలం నుంచి విద్యార్థులకు అందిస్తున్న స్టడీ అవర్ లో స్నాక్స్ అనే కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15 మొదలుకొని ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ సమయంలో స్నాక్స్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఏజన్సీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. ప్రతి రోజు ఒక్కో విద్యార్థికి రోజుకి రూ.15ల చొప్పున వెచ్చిస్తున్న ప్రభుత్వం సుమారుగా నెలకి విద్యార్థికి రూ.350లకు పైగా చెల్లిస్తుంది. భద్రాచలం మండలంలో ప్రభుత్వ జడ్పి పాఠశాలల్లో 163 మంది బాలురు, 214 మంది బాలికలు ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.
దుమ్ముగూడెం మండలంలో 215మంది బాలురు, 388 మంది బాలికలు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు చర్ల, ఇతర ప్రాంతాలు పరిశీలిస్తే భద్రాచలం నియోజకవర్గంలో సుమారుగా 1500లకు పైగా విద్యార్థులు ఈ సహాయాన్ని పొందనున్నారు. నెలకు ఒక్క భద్రాచలం నియోజకవర్గంలోనే అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం రూ. 6లక్షలకు పైగా ఖర్చు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ తరహాలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టగా పదవ తరగతి విద్యార్థుల కోసం అందిస్తున్న ఈ అల్పాహార కార్యక్రమం అదనంగా చేరింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధుల పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సీఎం కేసిఆర్ కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badradri, Bhadrachalam, Local News, Telangana schools