Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
లోకకళ్యాణార్థం ప్రతి ఏడాది భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో జరిగే సీతారాముల కళ్యాణం తమ వంతు భాగస్వాములు అవ్వాలని రామభక్తులు ఆశిస్తుంటారు. కానీ స్వామివారి కల్యాణంలో భాగస్వామ్యం అయ్యే అదృష్టం కొందరికి మాత్రమే లభిస్తుంది. ఈ కోవలోకే చెందినవారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన రామభక్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్లగా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ముత్యాల తలంబ్రాల ఉపయోగానికి గోటితో కొలిచిన తలంబ్రాలను అందిస్తున్నారు. ఈ సందర్భంగా కోరుకొండ శ్రీ కృష్ణచైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన భక్త బృందం గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను ప్రతి ఏటా సమర్పిస్తోందని, ఈ క్రమంలో మరోసారి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను తీసుకువచ్చి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవికి అందించినట్లు తెలిపారు.
భద్రాద్రి రామయ్యకు తీసుకురావడం ఇది 12వసారని, మొత్తం 600 కిలోల గోటితో ఒలిచిన తలంబ్రాలను సిద్ధం చేయగా వాటిలో 300 కిలోలు భద్రాద్రి రామయ్యకు అందజేయగా, మరో 300 కిలోలు ఒంటిమిట్ట రామయ్యకు అందజేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగాశ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికిఉత్సవాంగ స్నపనాన్ని అంతరంగి కంగా భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఆహ్వాన పత్రికల్లో పేర్కొన్న విధంగా సాయంత్రం నూతన కల్పవృక్ష వాహనంలో తిరువీధిసేవ నిర్వహించాల్సి ఉండగా అధికారులు ఆ సేవకు చలువ చొప్పరం వాహనంలో స్వామివారికి సేవ నిర్వహించడం గమనార్హం. కాగాధ్వజపట మండల లేఖనం, గరుడాధివాసం నిర్వహించారు.
ఇదిలా ఉండగా ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు భద్రాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. చెన్నై నుంచి వచ్చిన శ్రీ వెంకటాద్రి భజన సమాజానికి చెందిన భక్త బృందం రామాలయంలో భజన కార్యక్రమం నిర్వహించింది. ఇక వసంతపక్ష పుష్కరోత్సవాల్లో భాగంగా నిర్వహస్తున్న శ్రీరామాయణ మహాక్రతువు వేద మంత్రపఠనం మధ్య కొనసాగుతోంది.
ఈ నెల 22న క్రతువుకు అంకురార్పణ చేయగా 23 నుంచి పుష్కర యాగశాలలో చతుర్వేద హవనాలు, శ్రీరామాయణ హవనం, శ్రీరామ షడక్షరి, నారాయణ అష్టాక్షరి మంత్ర హోమాలు, సంక్షేప రామాయణ సామూహిక పారాయణం నిర్వహిస్తున్నారు. శ్రీరామాయణ మహాక్రతువులో అంతర్భాగంగా ఇష్టి యాగశాల వద్దశ్రీ సుదర్శనేష్టి హోమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అభయప్రాప్తి, సకలాభీష్ట సిద్ధి కోసం ఈ హోమాన్ని నిర్వహించినట్లు క్రతువు నిర్వాహకులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana