రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
తన గారాల కూతురు ఏదో ఒక రోజు దేశం గర్వించ స్థాయిలో ఉత్తమ క్రీడా ప్రదర్శన ఇస్తుందని చిన్ననాడే తన తండ్రి నమ్మాడు. అందుకే కాబోలు ఆ కూతురికి తన మూడో ఏటనే క్రికెట్ బ్యాట్ అందించి అండగా నిలుచున్నాడు. ఆడపిల్లలను సాంప్రదాయ కట్టుబాట్ల పేరుతో ఇంటికే పరిమితమవుతున్న రోజుల నుంచి నేడు ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదగాలని కోరుకునే సాధారణ తల్లిదండ్రులకు ప్రస్తుతం రోల్ మోడల్ నిలుస్తున్నాడు ఆ తండ్రి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణానికి చెందిన గొంగటి రామిరెడ్డి వృత్తిపరంగా ఫిట్నెస్ ట్రైనర్ చిన్నప్పటి నుంచే ఈ ప్రాంతాల వాసులకు జిమ్మిరెడ్డిగా సుపరిచితుడైన ఆయన కూతురే త్రిష. మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చి అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో అత్యద్భుత ప్రతిభను కనబరిచి నేడు ఎంతోమంది గిరిజన మహిళా క్రికెట్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచిన త్రిష బాల్యమంతా భద్రాచలంలోనే జరిగింది.
తన మూడో ఏటనే క్రికెట్ గ్రౌండ్లో అడుగుపెట్టిన త్రిష భద్రాచలానికి చెందిన సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు సుబ్రహ్మణ్యం వద్ద పలు మెలకువలు నేర్చుకునేది. ఆ సమయంలో ఇంకాస్త గట్టి ప్రోత్సాహాన్ని అందించేందుకు భద్రాచలం లాంటి ప్రాంతాల్లో శిక్షణ కేంద్రం అందుబాటులో లేకపోవడంతో హైదరాబాదులోని ఓ ప్రముఖ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు తండ్రి రామిరెడ్డి. న్యూస్ 18తోటెలిఫోన్ లో మాట్లాడుతూ త్రిష తండ్రి తన ఆనందాన్ని పంచుకున్నారు.
వివరాలు ఆయన మాటల్లోనే.. స్వతహాగా నేను టెన్నిస్ ప్లేయరు. ఆటల్లో నా వారసులు నన్ను మించేలా ఎదగాలని అనుకున్నా. ఒక క్రీడాకారుడిగా నా జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా నా పిల్లలకు క్రీడల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలని పిల్లలు పుట్టకముందే నిర్ణయించుకున్నా. అప్పటి వరకు ఉన్న ఆటలను పరిశీలిస్తే షటిల్, టెన్నిస్ తదితర క్రీడలు హైట్ అడ్వాంటేజ్ గేమ్స్. ప్లేయర్లో ఎంత ప్రతిభ ఉన్నా హైట్ సరిగా లేకపోతే ఈ ఆటల్లో రాణించడం కష్టం.
అయితే ఎత్తుతో సంబంధం లేని గేమ్స్ ఏంటని పరిశీలిస్తే ఫుట్బాల్, క్రికెట్ కనిపించాయి. భద్రాచలంలో ఫుట్బాల్ ఆడేందుకు, కోచింగ్ ఇచ్చేందుకు అనుకూలమైన పరిస్థితి లేదు. అదే క్రికెట్ అయితే గల్లీ నుంచి భద్రాద్రి కప్ వరకు పాజిటివ్ ఎన్విరాన్ మెంట్ ఉన్నట్టు అనిపించింది. దీంతో నాకు అమ్మాయి పుట్టినా, అబ్బాయి పుట్టినా భవిష్యత్తులో క్రికెట్లో గొప్ప స్థాయికి వెళ్లేలా అండగా నిలవాలని నిర్ణయించుకున్నా.
నా అంచనాలకు మించి ఏకంగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ ఉండటమే కాదు.. ఫైనల్లో విలువైన పరుగులు చేసింది త్రిష. మా కుటుంబం, బంధువులు, కోచ్లు అందరం సంతోషంగా ఉన్నాం. త్రిష విజయాన్ని భద్రాచలం పట్టణం అంతా కేక్ లు కట్ చేసుకుని తమ ఇంటి పండగలా చేసు కోవడం చూస్తే పట్టరాని సంతోషం కలుగుతోంది. అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో ఉన్న త్రిష ప్రస్తుతం భావనాస్ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకండియర్ (సీఈసీ) చదువుతోంది. రాబోయే రోజుల్లో ఇండియన్ సీనియర్స్ జట్టుకు ఎంపిక కావాలనేది లక్ష్యం. అంతేకాదు ఉమెన్ వరల్డ్ కప్ స్క్వాడ్లో తాను ఉండాలి.. కప్ కొట్టాలనేది మా కుటుంబ ఆకాంక్ష.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Local News, Telangana