Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) లోగత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు లోతట్టు మండలాలైన భద్రాచలం, బూర్గంపాడు, దుమ్మగూడెలలో చాలా గ్రామాలను వరదలు ముంచెత్తాయి. గత 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని విధంగా వరద ఈ ప్రాంతంలో ఉదృతంగా ప్రవహించింది. రికార్డ్ స్థాయిలో 2022లో 72.1 అడుగులకుపైగా గోదావరి వరద ప్రవహించడంతో భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతి ఏడాది 50 నుంచి 60 అడుగుల మధ్య గోదారి వరదరాడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం అయితే గత 37 ఏళ్లలో ఎప్పుడూ రాని విధంగా 70 అడుగులకు పైగా నీరు ప్రవహించడంతో ఈ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా గోదావరి నది (Godavari River) పై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ కాపర్ డ్యాం వల్లే వరద ఉదృతి అధికమైందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం గోదావరి కరకట్టను 80 అడుగుల మేర నిర్మించటం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పినట్లు అయిందని ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే నష్టం ఇంకా భారీ స్థాయిలో ఉండేదని బాధితులు అంటున్నారు.
ఉధృతంగా ప్రవహించిన వరద దాటికి సర్వం కోల్పోయిన వరద బాధితులను పరామర్శించేందుకు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో ఇటువంటి సమస్య పునరావృతం అవకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అందుకుగాను భద్రాచలం వద్ద నిర్మించిన గోదావరి కరకట్ట ఎత్తు పెంచడానికి రూ. 1000 కోట్ల నిధులతో కరకట్టను మరింత పటిష్టం చేస్తామని, వరద బాధితులకు పక్కా ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వమే స్వయంగా కట్టిస్తుందని ప్రకటించారు.
అయితే సీఎం కేసీఆర్ ఈ మాటలు చెప్పి ఏడు నెలలు పూర్తికావస్తున్నప్పటికీ నిధులు విడుదల కాలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి కొద్దిరోజుల్లో వర్షాకాలం మొదలవుతుందని జూన్ రాకముందే కరకట్టను పటిష్టం చేయడం, ముందుగా ప్రకటించిన డబల్ బెడ్ రూమ్ ఇల నిర్మాణం పనులు పూర్తి చేస్తే.. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన వరదకే భద్రాద్రి పట్టణానికి రక్షణగా ఉన్న గోదావరి కరకట్ట రాళ్లు లేచిపోయి, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. మళ్లీ అదే స్థాయిలో వరదలు వస్తే కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన అనంతరం ఆగ మేఘాల మీద పట్టణంలో స్థలాన్ని సేకరించేందుకు హడావుడి చేసిన జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ భద్రాచలం ఏజెన్సీలో గతేడాది సామాన్యులకు నాలుగు నెలల పాటు కంటిమీద కునుకు లేకుండా చేసిన గోదావరి వరదలు ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వస్తే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా కరికట్టను పటిష్ట పరిచేందుకు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana