Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
కాంగ్రెస్ పార్టీ (Congress Party) రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న హాత్ సే హాత్ జోడో యాత్ర ముందుగా నిర్ణయించినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) నుంచి కాకుండా ములుగు జిల్లా (Mulugu District) మేడారం (Medaram) నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. నిజానికి హాత్సే హాత్ జోడో పాదయాత్రను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ప్రారంభించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదట ఆసక్తి చూపించారు. తన నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించాలని భద్రాచలం ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సైతం రేవంత్ రెడ్డిని పలుమార్లు కోరారు. ఆ తర్వాత యాత్రకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న నేతలను ఒక తాటిపైకి తేవడం, సన్నాహక సమావేశాలు నిర్వహించడం, రోడ్ మ్యాప్ రూపొందించడం తదితర కార్యక్రమాలు కరువైపోయాయి.
నియోజకవర్గాల వారీగా నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోపీసీసీ అధ్యక్షుడి యాత్ర నిర్వహణకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆ పార్టీ నేతలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దీంతో రేవంత్ పాదయాత్ర భద్రాచలం నుంచి ఉంటుందా లేదా అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమయ్యాయి. వారి అనుమానాలను నిజం చేస్తూ హాత్ సే హాత్ జోడోయాత్రను ఫిబ్రవరి 6న ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల - ప్రాంగణం నుంచి ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.ఇదిలా ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలకు ఏడు చోట్ల పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఊరూవాడ అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది.
ఇలాంటి తరుణంలో పీసీసీ అధ్యక్షుడి యాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుంచి ప్రారంభమైతే పార్టీ పరంగా ఉత్సాహం వస్తుందని, టీడీపీ , సీపీఎం, బీఆర్ఎస్ లకు దీటుగా బల ప్రదర్శన చేసే అవకాశం వస్తుందని కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆశలు చిగురించాయి. అయితే చివరి నిమిషంలో యాత్ర ప్రారంభించే ప్రదేశం భద్రాచలం నుంచి ములుగుకు మారడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ పార్టీ అభిమానులకు మింగుడుపడడం లేదు. యాత్ర ప్రారంభించేందుకు అనువైన పరిస్థితులు, మౌలిక వసతులు, మీడియా కవరేజ్ తదితర అంశాల్లో మేడారం కంటే భద్రాచలం ఎన్నో విధాలుగా మెరుగు. అయినప్పటికీ యాత్రను ఈ జిల్లా నుంచి ప్రారంభించేలా చేయడంలో ఇక్కడి నాయకులు విఫలమయ్యారనే భావన ఆ పార్టీలో నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Local News, Revanth Reddy, Telangana