(Kranthi Kumar,News18,Bhadradri)
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యురాలితో పాటు ముగ్గురు మిలీషియా సభ్యులు లొంగిపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem)జిల్లాలో చోటుచేసుకుంది. లొంగిపోయిన వారి వివరాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్(SP Dr. Vineeth)వెల్లడించారు. ఛత్తీస్గఢ్ (Chhattisgarh)రాష్ట్రానికి చెందిన దళ సభ్యురాలు మాడవి మూయ, చర్ల ప్రాంతానికి చెందిన ముగ్గురు మిలీషియా సభ్యులు రవ్వ దేవ(Ravva Deva), కొవ్వాసి గంగ(Kovvasi Ganga), వందో దూలే(Vando Doole)ఉన్నారు. దళ సభ్యురాలు మధవి మూయ గత రెండు సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన చంద్రన్న దళంలో సభ్యురాలుగా పని చేస్తోంది. మిలీషియా సభ్యుడు రవ్వ దేవ గత మూడు సంవత్సరాలుగా చర్ల మిలీషియా సభ్యుడిగా కొనసాగుతూ పలు విధ్వంసకర సంఘటనలు, పెసర్లపాడు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడు. మరో మిలీషియా సభ్యుడు కొవ్వాసి గంగ గత సంవత్సరకాలంగా చర్ల (Charla)మిలీషియా సభ్యుడిగా పని చేస్తున్నాడు. వందో దూలే గత సంవత్సర కాలంగా చర్ల మిలీషియా సభ్యురాలిగా పని చేస్తోందని తెలిపారు.
ఆదివాసీలను వేధిస్తున్నారే లొంగుబాటు..
వీరంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, సీఆర్పీఎఫ్ 81, 141వ బెటాలియన్ ఎదుట లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నాయకులు అమాయకపు ఆదివాసీ గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ వారి దుర్మార్గపు చర్యలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని వీరు లొంగిపోయారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజల మద్దతును మావోయిస్టు పార్టీ పూర్తిగా కోల్పోయిందన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేసే నాయకులు సభ్యులు వారిని వారు రక్షించుకోవడమే కష్టంగా మారిందన్నారు. అమాయకపు ఆదివాసీ గిరిజనులపై మావోయిస్టు పార్టీ బెదిరింపులకు పాల్పడుతూ వారి నుంచి దౌర్జన్యంగా డబ్బులు, నిత్యావసర వస్తువులను బలవంతంగా వసూలు చేస్తోందని పేర్కొన్నారు.
మావోయిస్టు నాయకుల తీరుపై అసహనం..
ఒక్కొక్క ఇంటికి రూ.500 చొప్పున డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తూ వారు ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరు కాకపోతే బలవంతపు జరిమానాలకు పాల్పడుతున్నారన్నారు. గతంలో కుర్నపల్లి ఉపసర్పంచ్ ఇర్ఫా రాముడిని ఇంటి నుంచి తీసుకెళ్లి చంపడంతో మనస్తాపానికి గురైన అతడి భార్య కూడా ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇటీవల ములుగు జిల్లా కొండాపురం గ్రామంలో కూడా సబ్యా రాజేష్ అనే వ్యక్తిని సైతం ఇన్పా ర్మర్ నెపంతో హతమార్చారని పేర్కొన్నారు. మావోయిస్టుల చర్యల వల్ల ఆదివాసీ పిల్లలు అనాథలుగా మారుతున్నారన్నారు. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనే వారు తమ దగ్గరలోని పోలీస్ స్టేషనలో లేదా ఎస్పీ వద్దకు నేరుగా వచ్చి సంప్రదించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల తరపున ప్రకటించారు. సమావేశంలో కొత్తగూడెం ఓఎస్పీ సాయి మనోహర్, బెటాలియన్ కమాండెంట్లు కమల్ వీర్, చర్ల ఇన్స్పెక్టర్ అశోక్, ఎస్ఐ రాజు వర్మ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.