రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలానికి చెందిన గిరిజనులకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు సాగించడం హేయమని మావోయిస్టు పార్టీ నేత భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కార్యదర్శి ఆజాద్ ఆరోపించారు.
ఈ మేరకు బుధవారం మీడియాకు లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సదరు లేక ద్వారా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న భారీ ప్రాజెక్టు పనులలో సీతారామ ప్రాజెక్టు పనులు ఉన్నాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొడిశగట్టు, ఆర్లపెంట గ్రామాలకు చెందిన గిరిజనుల భూములు కాలువ నిర్మాణంలో కోల్పోయి నిర్వాసితులుగా మిగిలారని ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రాంతంలో కాలువ నిర్మాణం కోసం ఏరియల్ సర్వే చేశారని, నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిందని, కాలువ నిర్మాణం చేసే కొంత ప్రాంతంలో గిరిజనులకు వివిధ రకాలుగా నష్టపరిహారం చెల్లించారని, ఇది కూడా దళారీలు, అధికార పార్టీ నాయకుల చెప్పు చేతల్లో వారి కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు.
కొందరు మధ్య దళారీలు, అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుంటూ గిరిజనులకు అందవలసిన సొమ్మును అందకుండా కాజేస్తున్నారని ఆ ప్రకటనలో ఆరోపించారు. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని నిర్దాక్షిణ్యంగాగిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాలలో అధికారులు గిరిజనేతర పెత్తందార్ల దగ్గర ఉన్న ప్రభుత్వ భూములు గిరిజనుల పేరుపై చూపించి, అధికారులు, అధికార పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నారని విమర్శించారు. దళారీలు, అధికార పార్టీ నాయకులు గిరిజన ప్రజలను మోసం చేయాలని వారి చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనిహెచ్చరించారు. ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు నష్టపరిహారం అందే వరకు పనులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana