శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకను తిలకించేందుకు లక్ష మంది పైగా రామయ్య భక్తులు హాజరయ్యారు. సీతారాముల కల్యాణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం జరగగా.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను మంత్రి సమర్పించారు. చినజీయర్ స్వామి సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఎంతో నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో తలంబ్రాలుగా ఉపయోగించారు.ఈ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.116 చెల్లించి బుక్ చేసుకుంటే తలంబ్రాలను భక్తులకు హోమ్ డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్..ధాన్యం కొనుగోళ్లపై కీలక నిర్ణయం
ఆర్టీసీ చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. భద్రాద్రి రాములోరి తలంబ్రాల కోసం భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. కేవలం పది రోజుల్లోనే 50 వేల మంది భక్తులు తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. రోజుకు సగటున 5 వేల వరకు బుకింగ్‌లు అవుతున్నాయి. తెలంగాణ నుంచి మాత్రమే కాదు.. విదేశాల నుంచి కూడా బుకింగ్స్ వస్తున్నాయి. దుబాయ్, అమెరికా వంటి దేశాల నుంచి కాల్ చేసి.. సీతారాముల కల్యాణ తలంబ్రాలు కావాలని అడుగుతున్నారు.
తెలంగాణ చరిత్రలోనే రికార్డ్..ఈరోజు అత్యధిక విద్యుత్ వినియోగం..ఎంతంటే
భక్తులకు తెలంగాణ ఆర్టీసీ మరో అవకాశాన్ని కల్పించింది. శ్రీరామ నవమి కల్యాణ సమయంలోనే కాకుండా.. తలంబ్రాలను ఎప్పుడైనా భక్తులు పొందే సదావకాశాన్ని కల్పించింది. కార్గో పార్శిల్ సెంటర్‌కు వెళ్లి రూ.116 చెల్లిస్తే.. నిర్ణీత సమయంలో తలంబ్రాలను భక్తులకు అందజేస్తారు. తెలంగాణలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు.. TSRTC లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 9154680020, 7382924900ను సంప్రదించాలని సూచించారు. సంస్థకు చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా రాములోరి కళ్యాణ మహోత్సవాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి సీఎం కేసీఆర్ కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో సీతారాముల కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల విగ్రహాలను ఈ ఏడాది సువర్ణ ద్వాదశ వాహనాలపై ఊరేగించారు. భక్తరామదాసు కాలంలో ఇలా సువర్ణ ద్వాదశ వాహనంలో స్వామి వారిని ఊరేగించేవారు. ఇటీవల ఆ వాహనాలకు మరమ్మతులు పూర్తిచేయడంతో వేదపండితులు తిరిగి ఆ క్రతువును ప్రారంభించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Sri Rama Navami 2023