రిపోర్టర్ : సంతోష్ కుమార్
లొకేషన్ : భద్రాచలం
భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రతి ఏడాది జరిగే జానకి రాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలను, పట్టువస్తాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. నూతన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ముఖ్యమంత్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించక ఏడేళ్లు గడుస్తున్నాయి. తానీషా ప్రభువు కాలం నాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుండగా, ప్రభుత్వం తరపున భద్రాచలం రామయ్యకు పట్టువస్త్రాలు, తలంబ్రాలను సీఎం కేసీఆర్ ఈసారైనా సమర్పిస్తారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాగా కల్యాణం మరుసటి రోజు నిర్వహించే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పర్యటన ఇప్పటికే ఖరారైంది.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం వేడుకలకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ఈ ఏడాది ఇప్పటికే జిల్లాకు రెండు సార్లు వచ్చారు. గోదావరి వరద ముంపు బాధితులు పరామర్శకు ఒకసారి, కొద్ది రోజుల క్రితం నవ భారత్ ఏరియాలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభానికి మరోసారి వచ్చి వెళ్లారు. నవమి వేడుకలకు కూడా వస్తే జిల్లాకు ముచ్చటగా మూడుమార్లు వచ్చినట్లుగా ఉంటుంది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం వస్తారని, కల్యాణ వేడుకలకు హాజరవు తారని బీఆర్ఎస్ పార్టీ నేతల భారీగా ఆశలు పెట్టుకున్నారు. భద్రాచలం అభివృద్ధి, నవమికి సీఎం గైర్హాజరుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ రాకనే గట్టి సమాధానమని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ పర్యటనపై తీవ్ర సస్పెన్స్ నెలకొన్నది.
ఇదిలా ఉండగా భద్రాచలంలో 31న జరిగే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై రాక ఇప్పటికే ఖరారైంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలం పర్యటనకు రాగా, వారితోపాటు గవర్నర్ కూడా వచ్చారు. గోదావరి వరదల సమయంలో వరద బాధితుల పరామర్శకు అశ్వాపురం మండలానికి వచ్చారు. మళ్లీ ఈ ఏడాది మూడోసారి పుష్కర పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు.
హర్యానా రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ సైతం సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మార్చి 29న ఉదయం భద్రాచలం చేరుకోనున్నారు. రంగనాయకుల గుట్టపై దాతల సహాయంతో నిర్మించిన సీతానిలయాన్ని ప్రారంభించనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ మంగళవారం భద్రాచలం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేడుకలకు చినజీయర్ స్వామి రానున్నట్లు జీయర్ మఠం నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. కాగా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో సీఎం, గవర్నర్ పర్యటనకు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri, Local News