Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem district) కొత్తగూడెం పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వ్యవహారం గందరగోళంగా మారింది. లబ్ధిదారుల ఎంపికలో లక్షల రూపాయలు చేతులు మారాయంటూ ఆడియో లీకులు, ఆరోపణలు, ధర్నాలు, ఆందోళనలు జరుగుతున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 670 ఇళ్లకు సంబంధించి డ్రా తీయగా సగటున ప్రతీ వార్డుకు 20 వరకు ఇళ్లు కేటాయించారు. ఒక్కో వార్డుకు 20 ఇళ్లు వస్తున్నాయనే సమాచారం అందగానే కొన్నిచోట్ల కౌన్సిలర్లు, మరి కొన్నిచోట్ల వారి కుటుంబ సభ్యులు, అనుచరులు బేరసారాలకు తెర లేపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 'లక్ష రూపాయలు చెల్లిస్తే మీ పేరు లాటరీలో వస్తుందని, సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇల్లు మీ సొంతం అవుతుందని హామీ ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన కొందరు రూ. లక్ష సమర్పించగా, మరి కొందరి నుంచి రూ.2 లక్షల వరకు కూడా వసూలు చేశారని సమాచారం.
ఇదిలా ఉండగా లబ్ధిదారుల ఎంపిక సందర్భంగా మొదటి గంట పాటు లాటరీలో వచ్చిన నంబర్లు, పేర్లను అందరికీ బాహాటంగా చూపుతూ ప్రకటన చేశారు. ఆ తర్వాత లాటరీలో వచ్చిన నంబర్లు, పేర్లను లబ్ధిదారులకు చూపించకుండా అధికారులే చదువుకుంటూ పోయారు. వీరిలో కొందరి పేర్లు లాటరీలో రాగా, మరికొందరి పేర్లు గల్లంతయ్యాయి. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. చివరకు ఓ వైపు లాటరీ ప్రక్రియ ముగియకముందే ఆరోపణలు, ఆడియో లీకులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోఇటివలే వెలుగులోకి వచ్చిన ఆడియోలో ఓ బాధితుడు పట్టణంలోని కౌన్సిలర్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగి న్యాయం చేయాలని నిలదీశాడు. 'ఎన్నికల్లో మీ గెలుపు కోసం ఎంతో ప్రయత్నించాం. మీరు అడిగినంత డబ్బులు అప్పు చేసి మరీ ఇచ్చాం. ఇప్పుడు మా పేరు ఎందుకు లేదు' అంటూ ప్రశ్నించాడు.
దీంతో 'అందరికీ ఒకేసారి న్యాయం చేయలేను కదా.. మళ్లీ విడతలో మీకు న్యాయం జరుగుతుంది. డబ్బుల విషయం ఇప్పుడు ఎందుకు తీస్తున్నావ్' అంటూ అవతలి వ్యక్తి బదులిచ్చాడు. అయితే తమకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కొత్తగూడెం తహసీల్దార్ పి.వి. రామకృష్ణను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ నాయబ్ తహసీల్దారుగా పని చేస్తున్న జీ.ఎన్.కె.శర్మను కొత్తగూడెం తహసీల్దార్ నియమించారు. బదిలీ అయిన రామకృష్ణను కలెక్టరేట్ లో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
అయితే డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి లాటరీ ప్రక్రియ జరిగే ముందురోజు రాత్రి కొత్తగూడెం తహసీల్దారు కార్యాలయానికి వార్డు కౌన్సిలర్లు కొన్ని పేర్లతో జాబితా అప్పగించగా, ఆ జాబితాలోని పేర్లు లాటరీలో వచ్చాయి. అయితే కౌన్సిలర్లు సదరు లబ్ధిదారుల నుంచి డబ్బు వసూలు చేసి అందులో కొంత తహసీల్దార్ కు ముట్టజెప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా తహసీల్దారు నేరుగా కొంతమంది వ్యక్తులు కలిసి తమ పేర్లు లాటరీలో వచ్చేందుకు గానూ డబ్బులు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా వార్డు కౌన్సిలర్లు, లబ్ధిదారులకు మధ్య జరిగిన డబ్బుల ఒప్పంద సంభాషణలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Double bedroom houses, Local News, Telangana