(Kranthi Kumar, News 18, Bhadradri)
భద్రాచలంలోని శ్రీ సీతారామ శ్రీ చంద్రస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం ఏటా మాఘ పౌర్ణమి రోజు సహస్ర కలశాభిషేకం నిర్వహించడం భద్రాద్రిలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందులో మొదటగా సహస్ర కలశాభిషేక మహోత్స వాలకు అంకురార్పణ చేశారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ. హోమం, సహస్ర కలశావాహన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అర్చక స్వాములు.
దేవస్థానంలోని బేడ మండపం ఆవరణలో అత్యంత ఘనంగా సహస్ర కలశాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా సహస్ర కలశాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని నిత్యకల్యాణాలకు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అంతేకాకుండా భద్రాద్రి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణం సైతం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా మాఘ పునర్వసును పురస్కరించుకొని భద్రాచలంలో ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీరాముని జన్మదిన మహోత్సవాలను సంవత్సరంలో మూడుసార్లు నిర్వహించవచ్చని సంస్కృత పండితులు ఎస్టీజీ శ్రీమన్నారాయాణాచార్యులు న్యూస్ 18 కు తెలిపారు. శ్రీరాముడి జన్మదినం రోజునే కల్యాణం ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగా చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి కల్యాణం నిర్వహించడం ప్రసిద్ధమైందన్నారు. అలాగే వైశాఖ శుద్ధ సప్తమి పునర్వసు రోజు సౌరమానం ప్రకారం దక్షిణ దేశంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారని మూడోది మాఘమాసంలో వచ్చే పునర్వసు రోజు నిర్వహించే కల్యాణ క్రతువు స్వామివారికి విశేషంగా చేసుకోవచ్చని శ్రీవైష్ణవ ఆగ మాలైన పాంచరాత్రం, వైఖానస ఆగమంలో పేర్కొన్నారని తెలిపారు.
అదేవిధంగా భద్రాచలంలోని అంబాసత్రంలోనూ. మాఘ పునర్వసును పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించారు. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని మూడు రోజులు పాటు జరిగిన ప్రత్యేక కార్యక్రమాల్లో మొదటి రోజు స్వామివారికి సహస్ర కలశాభిషేకానికి అంకురార్పణ జరిగింది. ఈ సమయంలో ఎటువంటి విఘ్నాలు కలుగకుండా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రెండవ రోజు సహస్ర కలశ వాహన, మూడవరోజు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. దీనిని పురస్కరించుకుని సీతారామ చంద్రస్వామికి ప్రతీ నిత్యం నిర్వహించే నిత్యకళ్యాణం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వామికి పవళింపు సేవలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాసు, పరిపాలన వైదిక సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana