హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri: రోడ్లు నాశనం అయినా పట్టించుకోరా? ఇదేం పాలన? వచ్చి పరిశీలించే వెళతారా? 

Bhadradri: రోడ్లు నాశనం అయినా పట్టించుకోరా? ఇదేం పాలన? వచ్చి పరిశీలించే వెళతారా? 

రోడ్లు నాశనం

రోడ్లు నాశనం

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ఆర్ & బి రోడ్లు ధ్వంసమై రూ.150 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. అయితే వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Khammam, India

  (D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)

  భారీ వర్షాలు (Heavy Rains), వరదలు (Floods) భద్రాద్రి కొత్తగూడెం (Bhadrari Kothagudem)జిల్లాను అతలాకుతలం చేశాయి. వరదల ధాటికి జిల్లాలో ఎంతో మంది నిరాశ్రయులైయ్యారు. పంటలు చేతికందక రైతులు కుదేలయ్యారు. జిల్లాలో రహదారులు ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలలో ఆర్ & బి రోడ్లు ధ్వంసమై రూ.150 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. అయితే వర్షాలు (Heavy Rains) వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల (Damaged Roads) పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరమ్మతుల కోసం రూ. 150 కోట్లు కావాలని భద్రాద్రి కొత్తగూడెం ఇంజినీరింగ్ శాఖ అధికారులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం (Telangana Government) నుంచి ఎటువంటి స్పందన రాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాలలో రోడ్లన్నీ (Roads) ధ్వంసమై అడుగుకో గుంత ఏర్పడింది. కనీసం రిపేర్లు కూడా చేయకపోవడంతో గతుకుల రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు, వాహనదారులు ఆలోచిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా భద్రాచలం - చంద్రుపట్ల రూట్లో 10 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతింది. ఈ రోడ్డు రిపేర్లకు కనీసం రూ. 70 లక్షల వ్యయం అవుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. బూర్గంపాడు - ఏటూరునాగారం మధ్య 15 కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసం కాగా రూ. 70 లక్షలు పెడితేనే ప్రయాణానికి అనుకూలంగా మారుతుంది.

  సారపాక - మొండికుంట మధ్య దెబ్బతిన్న రోడ్లకు రూ. 9 లక్షలు వెచ్చిస్తేనే బాగవుతాయి. బూర్గంపాడు మండలం శివారున ఉన్న కుక్కునూరు వెళ్లే రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ రోడ్డును కేంద్ర బృందం పరిశీలించింది. రోడ్లపై పెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు తిరగలేని పరిస్థితి నెలకొంది. కనీసం గుంతలను పూడ్చేందుకు కూడా ప్రభుత్వం పూనుకోవడంలేదని ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే అంతే..

  ఇలా ఉండగా జిల్లాలో బ్రిడ్జిల పరిస్థితి కూడా మరింత దారుణంగా మారింది. పలుచోట్ల బ్రిడ్జిలు నిర్మాణ దశలోనే ఆగిపోగా మరికొన్ని బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ముఖ్యంగా అశ్వాపురం మండలంలో ఇసుకవాగు, తుమ్మలచెరువు లోలెవెల్ బ్రిడ్జి పూర్తిగా దెబ్బతింది. కనీసం రిపేర్ల కోసమైనా బడ్జెట్ కేటాయిస్తే రాకపోకలకు సాధ్యపడుతుంది. అలాగే పాల్వంచ మండలంలోని కిన్నెరసాని నదిపై యానంబైలు వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కిన్నెర సాని ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడల్లా యానంబైలుకు పైన ఉన్న గ్రామాలతో సంబంధాలు తెగిపోతున్నాయి.

  వర్షాకాలంలో రాకపోకలు పదేపదే నిలిచిపోయి ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వంతెన నిర్మాణ పనులు 2014 లో మొదలవగా నేటికీ పూర్తి కాలేదు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు వద్ద రాళ్ల వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు సగంలోనే ఆగిపోయాయి. దీంతో కొద్ది పాటి చినుకులు కురిసి నా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. రాంపురం, కొత్తతండా పంచాయతీల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు.

  Monsoon crops: కరుణించిన వరుణుడు: ఆ జిల్లా రైతుల కళ్ళల్లో వెల్లివిరిసిన ఆనందం

  అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి - వడ్డెర రంగాపురం గ్రామాల మధ్య పెదవాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఈ నిర్మాణ పనులకు రూ. 7 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 75 శాతం పనులే పూర్తయ్యాయి. ములకలపల్లి మండలం గొల్లగూడెం కంపగూడెం గ్రామాల మధ్య పాములేరు వాగుపై రూ. 3.7 కోట్ల వ్యయంతో చేపట్టిన వంతెన నిర్మాణం స్లాబ్ వరకు వచ్చాక ఆగిపోయింది. మూడు నెలలుగా పనులు నిలిచిపోయాయి. అంతేకాక జిల్లా హెడ్ క్వార్టర్ కొత్తగూడెం పట్టణ నడి బొడ్డున ముర్రేడు వాగు, గోధుమ వాగుపై రెండు వంతెనల నిర్మాణ పనులు 2015లో ప్రారంభమయ్యాయి.

  Great Artist: జీవకళ ఉట్టిపడే విగ్రహాలు: భద్రాద్రి యువకుడి ప్రతిభకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే 

  దాదాపు ఏడేళ్లు గడిచినా ఈ వంతెనల నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు. గోధుమ వాగు వంతెన పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకోగా ముర్రేడు వాగుపై పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. భద్రాచలం మండలం భద్రాచలం సారపాక గ్రామాల మధ్య గోదావరి నదిపై మరో వంతెన నిర్మాణ పనులను 2015లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటికీ ఈ వంతెన పనులు నత్త నడకన సాగుతూనే ఉన్నాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాలను కలుపుతూ కిన్నెరసాని, జల్లేరు వాగులపై వంతెన నిర్మాణానికి రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. రూ. 9 కోట్లు ఈ పనులకు కేటాయించారు. రెండేళ్లు గడిచినా వంతెనలు అందుబాటులోకి రాలేదు. ఇంకా పిల్లర్ల నిర్మాణమే పూర్తి కాలేదు. ఈ వంతెనలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ? ఏజెన్సీ ప్రజల కష్టాలు ఎప్పుడు తీరుతాయో తెలియని ప్రశ్న. రోడ్ల నిర్మాణ మరమ్మత్తుల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేసి చూడాల్సిందే.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadrachalam, Bhadrari kothagudem, Khammam, Local News, Road safety

  ఉత్తమ కథలు