(Kranthi Kumar,News18,Bhadradri)
పుట్టుకతోనే వినికిడి లోపం. ఓ కాలికి పోలియో(Polio)కారణంగా అంగవైకల్యం కూడా ఏర్పడింది. అయితేనేమి మొక్కవోని మనోధైర్యంతో విధిని ఎదిరించి వికలాంగులకు ఆదర్శంగా నిలిచాడో వ్యక్తి. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడమే కాకుండా ఖాళీ సమయంలో తన లాంటి ఎంతోమంది మూగ, చెవిటి వికలాంగులకు విద్యాబుద్దులు నేర్పిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు ఆయన. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem)జిల్లా ఇల్లందు మండలం ఇల్లందు పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన షేక్ రజాలి(Sheikh Razali).
వైకల్యాన్ని జయించిన రజాలి..
పుట్టుకతోనే వినికిడి లోపం అయితే ఏమి పట్టుదలతో వైకల్యాన్ని వెక్కిరిస్తూ బీఏ, బీఈడీ, లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. 2010లో ఎడ్ సెట్ లో దివ్యాంగుల విభాగంలో రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు, 2012లో దివ్యాంగుల కోటాలో డీఎస్సీ మొదటి ర్యాంకు సాధించారు. స్కూల్ అసిస్టెంటుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. తనలా ఇంకెవరు బాధపడకూడదని సింగరేణి సంస్థ సహకారంతో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆ కేంద్రంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న మూగ చెవిటి అంగవైకల్నే ఉన్న వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు తర్ఫీదిస్తున్నాడు. ఈయన దగ్గర శిక్షణ పొందిన పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా మరికొందరు ఇంకా శిక్షణ పొందుతూనే ఉన్నారు. పాఠాలు అయిపోయిన తర్వాత సదరు వికలాంగులలో మనోధైర్యం, ఆత్మ ధైర్యం నింపేందుకు క్రీడా పోటీలలో తర్ఫీదు కూడా ఇవ్వడం విశేషం.
మల్టీ టాలెంటెడ్..
ఇదంతా రజాలి పాషా జీవితంలో నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు పలు ప్రయోగాలు నిర్వహిస్తూ వినూత్న ఆవిష్కరణలు రూపొందిస్తుంటాడు. వినికిడిలోపం ఉన్న వారు ఉపయోగించుకొనేలా శిరస్త్రాణం తయారు చేసి పలువురుతో అభినందనలు అందుకున్నాడు. వెనక వచ్చే వాహనదారుడు హారన్ కొట్టినపుడు శిరస్త్రాణానికి అమర్చిన చిన్న ఎర్రబలుబు వెలిగేలా రూపొందించారు. ఆ వెలుతురును మిర్రర్ లో వెనుక నుంచి వస్తున్న వాహనం కనిపించేలా ఆవిష్కరించారు. ఇలా నూతన ఆవిష్కరణలు చేసి పలు సంస్థల ద్వారా ప్రశంసా పత్రాలను అభినందనలు అందుకున్నాడు.
దివ్యాంగుల సమస్యలపైనే ..
అందులో ముఖ్యంగా దివ్యాంగుల వీల్‌చైర్ సమస్యలపై తయారు చేసిన ప్రాజెక్టుకు 2019లో జాతీయ వికలాంగుల దినోత్సవం రోజు సన్మానంతో పాటు ప్రశంసా పత్రం, కొవిడ్ నేపథ్యంలో వీడియో రూపంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ కు240 ప్రాజెక్టులు అర్హత సాధించగా అందులో రజాలి పాషా రూపొందించిన డోర్స్ రెస్పాండ్ ఫైర్ యాక్సిడెంట్ (సినిమా, సమావేశం హాళ్లలో అగ్ని ప్రమాదాల సమయాల్లో తలుపులు తెరుచుకోవడం, అలారంతో సూచనలు అత్య వసర శాఖలకు ఫోన్లను వెళ్లేలా రూపొం దించిన) ప్రాజెక్టు ఆకట్టుకుంది. ఇలా తనకున్న వైకల్యాన్ని జయించి తనలాంటి ఎంతోమంది వికలాంగులకు ఆదర్శంగా నిలుస్తున్న రజాలి పాషా నిజంగా ప్రశంసనీయుడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.