Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రుని కోరికపై సాక్షాత్ శ్రీమన్నారాయణడే భూమిపై సాక్షాత్కరించిన పుణ్యభూమి భద్రగిరి పుణ్యక్షేత్రంలో రథసప్తమి పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు అర్చక స్వాములు. ఈ నేపథ్యంలో భక్తుల తో సందడిగా మారింది. వారాంతపు సెలవు దినం, రథసప్తమి కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారి మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. ఇదిలా ఉండగా రథసప్తమి పురస్కరించుకొని అనేక పురాణ గాథలు ఉన్నట్లు పలువురు పండితులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా నిజానికి సూర్యుడే మనకు కనిపించే దేవుడు. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగు తున్నాయి. భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది. సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథసప్తమి. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి.
'సప్తానాం పూరణీ సప్తమీ' అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారు పెద్దలు. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది. ఇది మామూలు రథంకాదు. దీనికి ఒక్కటే చక్రం. తొడల నుండి క్రిందభాగం లేని 'అనూరుడు' రథసారథి ఛందస్సులనే గుర్రాలే ఈ రథాన్ని లాగుతాయి.
ఏ మాత్రమూ నిలిచే ఆధారంలేని ఆకాశంలో పయనిస్తుంది ఈ రథం. ఇన్ని విలక్షణ విశేషాలున్నాయి కనుకనే ఈ పండగని రథం పేరుగల సప్తమిగా వ్యహరిస్తారు. ఇదిలా ఉండగా దేవస్థానంలో నిత్య కైంకర్యాలైన పలు పూజా కార్యక్రమాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో ప్రధానంగా స్వామివారి నిత్య కల్యాణ వేడుకను వైభవంగా నిర్వహించారు. సువర్ణ తులసీ అర్చన, నిత్యకల్యాణ వేడుకల్లో కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాకుండా వైభవంగా వెండి రథ సేవను స్వామివారికి నిర్వహించారు. స్వామి వారిని వెండిరథంలో కొలువుదీర్చి సంప్రదాయ బద్ధంగా పూజలు చేసి హారతి సమర్పించారు.
ఈఓ బి.శివాజీ, అధికారులు పాల్గొన్నారు. అలరించిన వాగ్గేయకారోత్సవాలు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో భక్తరామదాసు జయంతి ఉత్సవాలు నాలుగో రోజు కొనసాగాయి. వాగ్గేయకారోత్సవాల్లో భాగంగా. శనివారం హైదరాబాద్ కు చెందిన ఎంవీ కమలార మణి, ఎన్ రామమూర్తి బృందం, హైదరాబాద్ కు చెందిన శేషాచారి, రాఘవాచారి తదితరులు శాస్త్రీయ సంగీత ప్రదర్శన చేశారు. ఆదివారంతో వాగ్గేయకారోత్సవాలు ముగిశాయి.
కాగా నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని గుంటూరుకు చెందిన భక్తులు ఠాకూర్ రామ్ కిషన్ సింగ్, లక్ష్మీదేవి రూ. లక్ష విరాళం అందించారు. ఆలయ సూపరింటెండెంట్ నిరంజన్ పాల్గొన్నారు. మాఘమాసంలో స్వామి వారికి జరిగే పూజాది కార్యక్రమాల్లో భాగంగా 4,5వ తేదీల్లో సహస్రకల శాభిషేకం జరపనున్నట్లు ఆలయ ఈఓ శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు నిత్యకల్యాణాలు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana