Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ప్రముఖ దేవస్థానమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన ఘట్టాలైన తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమాలు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. ముఖ్య ఘట్టాలైన రెండు సేవలను పూర్తిచేసిన అనంతరం దేవస్థాన అధికారులు స్వామివారి రాపత్తు సేవల్లో నిమగ్నమై ఉన్నారు. 21 రోజులు పాటుగా మొదటి పది రోజులు పగలుపత్తుగా స్వామి వారికి సేవలు చేస్తారు. ఈ మొదటి పది రోజులు పగలుపత్తు సేవలో స్వామివారు దశావతారాలలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం తెప్పోత్సవం వైకుంఠ ద్వార దర్శనం పూర్తి చేసుకొని తిరిగి అధ్యయనోత్సవంలో రెండవ భాగమైన రాపత్తు సేవలలో స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఇదిలా ఉండగా రాపత్తు సేవలో మొదటి రోజుస్వామివారిని భద్రాచలం పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో గల శ్రీరామరక్ష మండపం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎస్పి రోహిత్ రాజ్ దంపతులు స్వామివారి ఊరేగింపు పల్లకికి ఘన స్వాగతం పలికారు. సకల రాజ లాంఛనాలు మంగళ వాయిద్యాలు కోలాట నృత్యాలు వేదమంత్రోత్సవాల నడుమ భద్రాద్రి, సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పట్టణంలోని ఏఎస్పి కార్యాలయానికి బాణాసంచా వెలుగుల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీరామ రక్షా మండపం వద్ద స్వామివారిని ఆసీనులు చేసి ప్రత్యేక పూజలు చేశారు అర్చక స్వాములు.ఏఎస్పీ కార్యాలయంలోని శ్రీరామరక్ష మండపం వద్దనే స్వామివారికి పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, వేద పఠనం తదితర పూజలు చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఇదిలా ఉండగా ముక్కోటిని పురస్కరించుకొని నిర్వహించిన ఉత్తరద్వార దర్శనంలో భక్తుల సమస్యలు షరా మామూలయ్యాయి. భద్రాద్రిరామయ్య సాక్షిగా రూ.2000 చెల్లించి వీఐపీ టికెట్ కొన్న భక్తులకు ఆ సెక్టారులో చోటు దక్కలేదన్నది వాస్తవం. ప్రజా ప్రతినిదులకు, ఉన్నతాధికారులకు మాత్రమే అందాల్సిన వీవీఐపీ పాస్ లు (పూర్తిగా ఉచితం) అనర్హుల చేతిలోకి వచ్చాయనే విమర్శలు వచ్చాయి.
భక్తులకు విక్రయించేందుకు సిద్ధం చేసిన సుమారు 50 వేల లడ్డూలు మిగిలినట్లు తెలుస్తోంది. భద్రాచలంలో ఉత్తరద్వార దర్శనను తిలకించేందు కోసం మొత్తం 3,800 టికెట్లను దేవస్థానం అధికారులు సిద్ధం చేసారు. ఇందులో రూ.2000 విలువ గలవి, 1000, రూ.500 విలువ గలవి, 250 విలువ గల టికెట్లు ఉన్నాయి. అయితే ఇందులో రూ.2000వి కొద్ది మొత్తంలో మిగలగా రూ.500, రూ.250 విలువ గల టికెట్లు ఎక్కవగా మిగిలినట్లు దేవస్థానం ఉద్యోగ వర్గాలే పేర్కొంటున్నాయి. ప్రొటోకాల్ అధికారులు, ప్రజా ప్రతినిధులకు మాత్రమే కేటాయించాల్సిన వీవీఐపీ పాస్ లు రాజకీయపార్టీల్లోని కొంత మంది సామాన్యుల చేతిలో ఉండటం పట్ల అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ముక్కోటికి దేవస్థానం రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేసింది. ఈ క్రమంలో భద్రాద్రి రామయ్యను సోమవారం రాత్రి వరకు 19,300 మంది దర్శించుకున్నారు. కాగా 50 వేల లడ్డూలు మిగిలినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana