Kranthi Kumar, News 18, Bhadradri
'చెత్త, చెత్త కాదు.. సద్వినియోగ పరిస్తే మళ్లీ ఉపయోగపడుతుంది. చెత్తను రీ సైకిల్ చేద్దాం అంటూ మున్సిపల్ అధికారులకు ఫోన్ చేయగానే వినిపించే కాలర్ ట్యూన్ వినిపిస్తుంటుంది. ఇళ్లలో రోజు వారీ వెలువడే వ్యర్థాలు మరో రూపంలో మళ్లీ ఉపయోగపడుతాయనడంలో సందేహం లేదు. సరిగ్గా ఉపయోగిస్తే లాభదాయకం గానూ ఉంటుంది. దీన్నే నిరూపిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు. చెత్తను సేకరించి తద్వారా లాభాన్ని సైతం అర్జిస్తున్నారు. మొదట్లో పాల్వంచ పట్టణం వ్యాప్తంగా చెత్తను సేకరించి ట్రాక్టర్ల ద్వారా పట్టణ శివార్లలో డంప్ చేసేవారు. వ్యర్థాలను దహనం చేయడం వల్ల కాలుష్యం పెరిగిపోయేది. అంతేకాక దుర్వాసన కూడా వెదజల్లేది.
కానీ పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి పలు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి కాలనీలో చెత్తను సేకరించే సమయంలోనే తడి, పొడి చెత్తగా వేర్వేరుగా సేకరిస్తూ రీసైక్లింగ్ చేయడం ద్వారా మున్సిపాలిటీలు ఆదాయాన్ని పొందుతున్నాయి. పాల్వంచ శివారు ప్రాంతంలోని శ్రీనివాస నగర్ కాలనీలో 2021 ఫిబ్రవరి 2న చెత్తను రీసైకిలింగ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలో రోజూ 30 ట్రాలీ ఆటోలు, 3 ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇంటింటికి తిరిగి సేకరించి ఈ కేంద్రాలకు తరలిస్తున్నారు.
పొడి చెత్తను గ్రేడ్ల వారీగా విభజిస్తారు. సీసాలు, అట్టలు, బస్తాలు, కవర్లు, పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఇలా అనేక రకాల వస్తువులను వేరు చేస్తారు. అనంతరం వాటిని బేల్ (వంద కేజీల బండిల్)గా తయారుచేసి పలు కంపెనీలకు ఎగుమతి చేస్తున్నారు. మిగిలిన తడి చెత్త ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బెడ్డల్లో భద్రపరిచి డికంపోస్ట్ అయ్యేవరకు ఉంచుతారు. ఇలా తడి చెత్త డికంపోస్ట్ అయ్యే క్రమంలో బెల్లం నీళ్లు, ఆవు పేడ నీళ్లు తదితర పదార్థాలను కలిపి డీకంపోస్టు అయిన చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. ఇలా పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు పొడి వ్యర్థాలవనరుల కేంద్రం, సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు బహుళ ప్రయోజనాలను అందుకోవడమే కాకుండా మున్సిపాలిటీకి ఆదాయంతో పాటు కార్మికులకు ఉపాధిని కల్పిస్తున్నారు.
పొడి చెత్త వనరుల కేంద్రం నిర్వహణ బాధ్యతను ఓ కాంట్రాక్ట్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రతీ రోజు పొడి చెత్త మున్సిపాలిటీ వ్యాప్తంగా సుమారు రెండు టన్నుల వరకు సేకరిస్తూ నెలకు లక్షల్లో మున్సిపాలిటీకి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. తడి చెత్తను కంపోస్ట్ సేంద్రియ ఎరువుగా తయారుచేసి కేజీ 20 రూపాయల నుంచి రైతులకు ఎరువు కావలసిన పట్టణ వాసులకు అందిస్తున్నారు. ఈ కేంద్రం స్థాపించిన ఏదాది కాలంలో సుమారు 15 టన్నులకు పైగా సేంద్రియ ఎరువును తయారు చేయడం గమనార్హం. ఈ కేంద్రంలో ఒక సూపర్ వైజర్, నలుగురు కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana