Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) రాజకీయాలు అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి రోజుకో వివాదం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS) ను చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే స్థానికఎమ్మెల్యే హరిప్రియ ఆత్మీయ సమ్మేళనంలో రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ఒకసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోనిఇల్లెందు మున్సిపాలిటీలో అసమ్మతి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఈ క్రమంలో అసమ్మతి కౌన్సిలర్లంతా ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిగా ఉన్న ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరావు (డీవీ)ను పదవి నుంచి తొలగించడం ద్వారా తమ సత్తా చాటాలన్న వ్యూహంతో అవిశ్వాసానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
శని, ఆదివారాల్లో ఇల్లెందు మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు కొందరు మధ్యవర్తులు బేరసారాలు సాగించడం, శనివారం రాత్రి ఆంబజార్లో అసమ్మతి కౌన్సిలర్లతో రహస్య సమావేశం జరగడం పట్టణంలో సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కొద్దిమంది కౌన్సిలర్లు కొంతకాలంగా మున్సిపల్ చైర్మన్ డీవీని తీవ్రంగా విభేదిస్తున్నారు. బహటంగానే ఎడముఖం, పెడముఖంగా ఉండే పలువురు కౌన్సిలర్లు ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇల్లందు మున్సిపాలిటీలో కొద్ది నెలలుగా కౌన్సిలర్లతో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే హరిప్రియ, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పలుమార్లు యత్నించారు. అయినా విభేదాలు సద్దుమణగలేదు. సభలు, సమావేశాలకు ఇరు వర్గాలు హజరవుతున్నా ఎడమొఖం పెడముఖంగానే ఉంటున్నారు. అసమ్మతి వర్గం మాత్రం బహిరంగ ఆరోపణలు, విమర్షలకు వెళ్లకుండా అసమ్మతితో రగిలిపోతున్న కౌన్సిలర్లను కూడ గట్టడం ద్వారా పదవీచ్యుతుడిని చేసి ఇల్లెందు నియోజవర్గ కేంద్రంలోనే బీఆర్ఎస్ ను, చైర్మన్ డీవీని దెబ్బతీయాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మున్సిపల్ పాలకవర్గం మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఇటీవల ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో సైతం కొందరు అసమ్మతి నేతల వార్డుల నుంచి జనసమీకరణ ఆశించిన రీతిలో లేకపోవడం కూడా తాజా పరిణామాలను బలపరుస్తోంది. ఇదిలా ఉండగాఇల్లెందు మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు జోరుగా యత్నాలు సాగుతున్నాయి. కలెక్టర్లకుఇవ్వనున్న అవిశ్వాస తీర్మాణం నోటీసుపై సంతకం చేస్తే తొలుత రూ.5 లక్షలు ఇస్తామని, నోటీసుకు, అవిశ్వాసానికి అనుకూలంగా, అవిశ్వాసానికి మద్దతుగా పాల్గొన్న తరువాత మరో రూ.5 లక్షలు ఇస్తామంటూ కొందరు మధ్య వర్తులు రెండు రోజులుగా కౌన్సిలర్లతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.
అవిశ్వాస నోటీసుపై ఆదివారం నాటికి 10 మంది కౌన్సిలర్లు సంతకం చేశారని, సోమవారం వరకు మరో నలుగురు సంతకాలు చేసిన తరువాత కలెక్టర్లకునోటీసు ఇచ్చేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు చైర్మన్ కుఅనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు కౌన్సిలర్లకు రూ.5 లక్షల వరకు ఆఫర్ కూడా ఇవ్వడంతో చైర్మన్ శిబిరంలోని ముగ్గురు కౌన్సిలర్లు సైతం అవిశ్వాసానికి సై అన్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ చైర్మన్ పైఅవిశ్వాస యత్నాలు కార్యరూపం దాలిస్తే రానున్న రోజుల్లో ఇల్లెందు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుందని పరిశీలకులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.