Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు హత్య చేసిన నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. జి వివరించారు. చండ్రుగొండ మండలం పోకలగూడెం ఫారెస్ట్ బీటులోని ప్లాంటేషన్ పనులను సందర్శించడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తేజావత్ రామారావు కలిసి వెళ్లారు. అక్కడ ప్లాంటేషన్ పనులను పరిశీలిస్తుండగా బెండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎఱ్ఱబొడు గుత్తికోయ గుంపునకు దగ్గరలో ఉన్న ప్లాంటేషన్లో పశువులను మేపుతున్నట్లు ఫోన్ ద్వారా సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్నారు.
ఎఱ్ఱబొడు గుత్తికోయ గుంపునకు చెందిన మడకం తులా, పోడియం నంగా ఆ సమయంలో అక్కడ పశువులు మేపుతుండగా వారి వెళ్లిన శ్రీనివాస్ ఇక్కడ పశువులు మేపవద్దని వెళ్లిపోవాలని చెప్పారు. అలాగే పశువులు మేపుతున్న దృశ్యాలను ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో సెక్షన్ ఆఫీసర్ రామారావుపై తులా అనే వ్యక్తి దాడికి పాల్పడగా.. శ్రీనివాసరావు అడ్డుకున్నారు. దీంతో మమ్మల్నే వీడియోలు తీస్తావా అంటూ ఇద్దరు గిరిజనులు.. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై వేట కొడవళ్లతో దాడికి పాల్పడి విచక్షణా రహితంగా నరికేశారు. అక్కడే ఉన్న సెక్షన్ ఆఫిసర్ రామారావు పరుగులు పెట్టుకుంటూ వెళ్లి అధికారులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు శ్రీనివాసరావును వెంటనే చండ్రుగొండ PHCకి తరలించారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సెక్షన్ ఆఫీసర్ రామారావు ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు
చండ్రుగొండ మండలం గొత్తికోయ, ఎఱ్ఱబొడు, బెండాలపాడుకి చెందిన తులా, నంగాను ఎఱ్ఱబొడు గ్రామశివార్లలో సీతారామ కాలువ కట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా వారిరువురు నేరాన్ని ఒప్పుకున్నారు. హత్యానంతరం వారిరువురు అడవిలో తలదాచుకుని ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం, సుకుమా జిల్లాలోని తన స్వగ్రామానికి పారిపోవడానికి ప్లాన్ వేసుకున్నారు. ఇందుకోసం డబ్బుల కొరకు ఎఱ్ఱబొడులోని తమ గుంపుకు వెళుతుండగా వీరిని అరెస్టు తచేశారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana