(G.SrinivasReddy,News18,Khammam)
చదువుకొని నాగరికత తెలిసిన మనుషులే చెత్త ఎక్కడపడితే అక్కడ పడేస్తున్న పరిస్థితుల్లో.. నోరు లేని జీవి మూత్ర విసర్జన (Urine)చేసిందని సంబంధిత యజమానికి వంద రూపాయలు ఫైన్ (100 Rupees fined)వేసి కేసు పెట్టిన వైనం ఇది. పరిసరాలను శుభ్రంగా ఉంచాలనుకోవడం స్వాగతించదగిన విషయమే. అదే సమయంలో స్థానిక కాలమాన పరిస్థితులను కూడా గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri kothagudem) జిల్లాలో అధికారుల తీరు అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. అసలు ఏం జరిగిందంటే..
పశువు చేసిన పనికి ఫైనా..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ వాతావరణం ఉండే ఇల్లందు పట్టణంలో ఎద్దులు ఆవులు బర్రెలు గొర్రెలు మేకలు తిరుగుతుండడం సర్వసాధారణమైన విషయం. పశువులు కాబట్టి ఎక్కడపడితే అక్కడ మల,మూత్రాలు విసర్జిస్తుంటాయి. అయితే సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ఒక ఎద్దు మూత్రం పోసిందని.. సింగరేణి సిబ్బంది అత్యుత్సాహంతో సంబంధిత రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది పోలీసులు కేసు ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు ఆ రైతుకు వంద రూపాయలు అపరాధ రుసుం విధించింది. ఎద్దుల బండితో సామాన్లు తరలిస్తూ జీవనం పోసుకుంటున్న తనకు ఇలాంటివి కష్టమే కదా అన్నది రైతు సుందర్లాల్ ఆవేదన.
మూత్ర విసర్జన చేసినందుకు వంద కట్టించారు..
పట్టణం మొత్తంలో ఎక్కడైనా పశుపక్షాదులు మల. మూత్ర విసర్జనలు చేయకుండా ఉంటాయా.. వాటి నియంత్రించడం సాధ్యమయ్యే పనేనా.. ఇది ఇప్పుడు ఆ సాధారణ రైతు వేస్తున్న ప్రశ్న. ఇవన్నీ చెప్పొద్దు పైన కట్టి తీరాల్సిందేనని అధికారులు హుకుం జారి చేయడంతో ఫైన్ కట్టి బయటపడ్డాడు సుందర్లాల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ పరిధిలో జరిగిన ఈ ఘటన అధికారుల అత్యుత్సాహానికి అడ్డం పడుతుంది. అంతా గ్రామీణ వాతావరణం కావడంతో పశువులు తిరగడం చాలా సాధారణ విషయం, కానీ అదేదో జరగదాన్ని జరిగినట్టు అపరాదృశ్యం విధించడం ఏంటన్నది చర్చగా మారింది.
ఇదెక్కడి విచిత్రం మహాప్రభో..
ఇల్లందు పట్టణంలోని నెంబర్ టు బస్తీలో నివసించే సుందర్ లాల్ స్థానికంగా ఉంటూ ఎద్దుల బండిలో బాడుగలు తోలుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. ఎద్దుల బండితో పరిసర ప్రాంతాల్లోని మట్టి ఇసుక తోలుకుంటూ నాలుగు పైసలు సంపాదిస్తున్నా డు. గత కొన్ని సంవత్సరాల నుండి ఇదే వృత్తిగా భావిస్తూ ఎద్దుల పోషణ చూసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక సింగరేణి జిఎం కార్యాలయం ముందు నుండి మట్టి తీసుకొని వచ్చేందుకు వెళుతున్న క్రమంలో జిఎం కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసిందని జిఎం కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారని సుందర్ లాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సుందర్ లాల్ ను స్థానిక పోలీసులు పిలిపించి జిఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రవిసర్జన చేసిందని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టు కు పంపిస్తామని అన్నారు.
అధికారుల అత్యుత్సాహం ..
పోలీసుల పిలుపుతో కంగుతున్న సుందర్ లాల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎద్దు మూత్రం పోస్తే కేసు పెట్టడం ఏంటి సార్ అని అడిగాడు. దీంతో కేసు నమోదయిందని కోర్టుకి పోయి ఫైన్ చెల్లించ మని చెప్పారని ఫైన్ చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని అన్నారని సుందర్ లాల్ ఆవేదనతో చెప్పారు. బాడుగలు తోలుకొని జీవించే నాకు ఎద్దుల బండిని పోషించే కష్టమవుతున్న తరుణంలో ఉచ్చ పోసినందుకు ఫైన్ కట్టడం ఏంటి సార్ అని పోలీసుల ఎదుట బాధపడుతుండడంతో స్థానిక కోర్టు పోలీస్ కానిస్టేబుల్ స్పందించి స్థానిక ఇల్లందు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో అతనికి ఫైన్ చెల్లించి రసీదు ఇవ్వడం జరిగింది. పోలీసులు సహాయం చేశారని సింగరేణి అధికారులు మాత్రం కేసు పెట్టి ఆందోళన గురి చేశారని అన్నారు. ఏది ఏమైనా ఎద్దు మూత్రం పోసినందుకు కేసు పెట్టి ఫైన్ విధించడం జిల్లాలోనే చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.