Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) లోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల లడ్డూపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని తయారు చేసిన లడ్డూల్లో కొన్ని బూజుపట్టిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశించారు. ఈ నేపధ్యంలో ఇందుకు బాధ్యులైన ఓ ముగ్గురిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు దేవస్థానం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే దేవస్థానంలో జరిగిన ఘటనపై కమిషనర్ విచారణ కమిటీని వేయడం, విచారణ కోసం దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి, దేవాదాయ శాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ బాధ్యురాలు రమాదేవి, భద్రాచలం ఆర్డీవో రత్నకల్యాణి క్షేత్రస్థాయిలో జనవరి 11న పరిశీలించగా అదనపు కమిషనర్ జ్యోతి నివేదికను కమిషనర్ కు అందజేశారు.
ఈ క్రమంలో ఈ ఘటనపై శాఖపరమైన చర్యలు తీసుకుంటారని తొలి నుంచి దేవస్థానం వర్గాలు అంచనా వేస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో దేవస్థానంలో ఈవో తరువాత కీలకపాత్ర పోషించే ఓ అధికారితో పాటు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే మరో అధికారి, వీరిద్దరితో పాటు సంబంధిత సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ పై శాఖపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని దేవస్థానం అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి చర్యలు చేపట్టకపోయినా ఇందుకు సంబంధించిన చర్యలను పది రోజుల్లో తీసుకొని, ఆ సమాచారం తనకు అందజేయాలని కమిషనర్ ఇప్పటికే ఆదేశించిన క్రమంలో రాబోయే వారం రోజుల్లో శాఖపరంగా చర్యలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే లడ్డూలు బూజుపట్టడం, తదనంతర దేవస్థానం కేంద్రంగా జరిగిన పరిణామాల క్రమంలో వాటి నష్టాన్ని ఆ ముగ్గురి నుంచి రికవరీ చేస్తారా లేదంటే శాఖపరంగా చర్యలు తీసుకుంటారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ విషయంపై భద్రాద్రి దేవస్థానం ఈవో బి.శివాజీని 'న్యూస్ 18' సంప్రదించగా కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఇందుకు సంబంధించిన అధికారిక చర్యలు చేపట్టాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముక్కోటికి సిద్దం చేసిన లడ్డూల్లో కొన్ని బూజుపట్టడంతో శాఖపరమైన చర్యలకు దేవస్థానం అధికారులు ఉపక్రమిస్తున్నారు.
ఇది చదవండి: ఈమెవన్నీ పాతకాలం నాటి పద్ధతులే.. లైఫ్ స్టైల్ కి దండం పెట్టాల్సిందే..!
అంతవరకు బాగానే ఉంది. కాని అసలు లడ్డూలు విక్రయించకపోవడానికి లోపం ఏమిటి, ఆ లోపాన్ని ఏ విధంగా సరిదిద్దాలి అనే దానిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించాలని భక్తులు కోరుతున్నారు. రామాలయంలో ప్రధాన ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు, అధ్యయనోత్సవాలు జరిగిన సమయంలో లడ్డూ ప్రసాద విక్రయాలను భారీ సంఖ్యలో ఏర్పాటు చేయడం భక్తులకు అందుబాటులోకి తేవడం ఆహ్వానించదగ్గదే అని భక్తులు పేర్కొంటున్నారు.
అయితే వాటిని ఏ ప్రాంతంలోకి వెళ్లేందుకు సరైన అవగాహన భక్తులకు కల్పించకపోవడం అధికార యంత్రాంగం లోపమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి లడ్డూ ప్రసాదాలు లాంటివి విక్రయించేటప్పుడు ఆలయ పరిసరాలు, సత్రాలు, కాటేజీలు, కల్యాణ మండపాలు తదితర దేవస్థానంకు సంబంధం ఉన్న ప్రాంతాల్లో విక్రయాలు చేపట్టాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికార యంత్రాంగం దృష్టిసారించడం లేదన్నది వాస్తవమని భక్తులు పేర్కొంటున్నారు. మామూలు లడ్డూ విక్రయాల మాదిరిగా ఇష్టానుసారంగా వివిధ ప్రాంతాల్లో లడ్డూ ప్రసాద విక్రయాలు చేపట్టడం వలన పవిత్రపై సైతం భక్తులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇకనైనా జిల్లా అధికార యంత్రాంగం రాబోయే శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం సమయంలో లడ్డూ విక్రయాలను దేవస్థానంకు అను బంధంగా ఉన్న ప్రాంతాల్లోనే విక్రయిస్తే సముచితంగా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana