Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో ఇకపై తిరువీధి సేవలో నూతన వాహనాలపై స్వామి వారు దర్శనమివ్వనున్నారు. అమెరికా (America) కు చెందిన ప్రవాస భారతీయ వాసవి సంఘం ఆధ్వర్యంలో దేవస్థానానికి స్వామి వారి తిరువీధి సేవ నిమిత్తం 12 వాహనాలను అందించారు. దాదాపు రూ.75 లక్షల వ్యయంతో తయారుచేసి అందించడం జరిగింది. ఈ వాహనాలలో సార్వభౌమ, హనుమంత, కల్పవృక్ష, సింహాసన, హంస, సింహ, గజ, అశ్వ, చంద్రప్రభ, సూర్యప్రభ, గరుడ, శేష వాహనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా వాహనాల విశిష్టతను వైదిక పెద్ద ఆస్థాన స్థానాచార్యులు కే.ఈ స్థల సాయి న్యూస్ 18కు వివరించారు.
సార్వభౌమ వాహనం ..
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవానుడి ఏలుబడిలో 14 లోకాలున్నాయి. అలాంటి రాముణ్ని సార్వభౌమ వాహనంలో దర్శించుకోవడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి. ఈ వాహన సేవ ఇక్కడ ప్రత్యేకం.
హానుమంత వాహనం..
రాముడికి బంటు. భక్తుల్లో అగ్రగణ్యుడిగా హనుమంతుడు కీర్తిగడించాడు. రాముడు ఎక్కడుంటే అక్కడ అంజన్న ఉంటాడన్నది భక్తుల నమ్మకం. హనుమంతుడి వాహనంపై రాములవారిని దర్శిస్తే శుభం కలుగుతుంది. భయాలు తొలగును.
సింహ వాహనం..
భగవద్గీతలో భగవానుడు మృగాలలో సింహం తానే అని చెప్పుకొన్నాడు. అందుకే దేశ రాజముద్రలో నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది. ఈవాహనంపై స్వామిని దర్శించుకుంటే భయాలు తొలగుతాయి.
అశ్వ వాహనం..
వేగానికి ప్రతీక అశ్వం కనుక అశ్వధాటి అంటారు. భగవానుడు ధరించిన అవతారాలలో అశ్వవదసుడూ ఉన్నాడు. ఇది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దీనిపై రాముణ్ని సేవిస్తే కోరుకున్నవి జరుగుతాయి.
చంద్రప్రభ..
16 కళలతో వెలుగొందుతూ.. చంద్రుడులా 16 గుణాలతో ఆనందాన్ని అంచిందించేవాడు రామచంద్రుడు. ఈవాహనంపై స్వామిని దర్శిస్తే మనసులోని మాలిన్యాలు తొలగుతాయి.
శేష వాహనం..
శ్రీమన్నారాయణుడికి శయ్యగా, ఆసనంగా, గొడుగుగా, పాదుకగా ఆదిశేషుడు ఉన్నాడు. స్వామివారి అవసరానికి అనుగుణంగా.. తన రూపాన్ని మార్చుకునేవాడు. ఈ రూపంలో స్వామిని దర్శిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.
గజ వాహనం..
గజ వాహనం ఐశ్వర్యానికి చిహ్నం. చక్రవర్తి ఏనుగు అంబారీపై ఊరేగుతాడు. రామాయణ కాలంలో అయోధ్య వాసులు రాముణ్ని గజవాహనంపై ఊరేగుతుండగా చూడాలని కోరుకున్నారు. ఈవాహనంపై స్వామిని వీక్షిస్తే ఐశ్వర్యం సమకూరుతుంది.
కల్పవృక్ష వాహనం..
వృక్షాలలో దైవ వృక్షమిది. క్షీర సాగర మధనంలో ఉద్భవించింది. ఈ వాహనంపై దేవ దేవుణ్ని వీక్షిస్తే భక్తుల కోర్కెలు తీరుతాయని నమ్మకం.
సూర్యప్రభ వాహనం..
సూర్యుణ్ని ఆరాధిస్తే ఆరోగ్యం కలుగుతుంది. గ్రహాలకు రాజైన సూర్యుడి వంశంలోనే రాముడు జన్మించాడు. సూర్యప్రభపై స్వామిని దర్శస్తే ఆరోగ్యంతో పాటు సకల శుభాలు కలుగుతాయి.
గరుడ వాహనం..
భగవానుడైన శ్రీమన్నారాయణుడి వాహనాల్లో ప్రధానమైంది. నిరంతరం స్వామితో ఉండేవాడు గరుత్మంతుడు. వేదమూర్తి గరుత్మంతునిపై రాముణ్ని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంది.
హంస వాహనం..
ఇది జ్ఞానానికి ప్రతీక, వేదాంతంలో జ్ఞానాన్ని పొందిన వారిని పరమ హంసలు అంటారు. పాలు, నీటిని వేరుచేసే గుణం హంసకు ఉంటుంది. సుగుణాలను గ్రహించి. చెడు గుణాలను తిరస్కరించే దివ్య గుణం దీని సొంతం. హంస వాహనంపై స్వామిని దర్శించుకుంటే జ్ఞానం సిద్ధిస్తుంది.
సింహాసనం..
రాజ లాంఛనాల్లో ప్రధానమైననది. రాజసానికి ప్రతీక ఈ సింహాసనంపై స్వామిని దర్శిస్తే సకల శుభాలు కలుగును.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana