Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ఒకే మాట ఒకటే బాణం నింగే విరిగి పడినా ప్రతభంగమ్ము కానివ్వడమ్మా..! సందేహించకమ్మా రఘు రామ ప్రేమను అంటూ శ్రీరాముడి గుణాలు గురించి భక్తులు భజనలు చేశారు. ఎక్కడ చూసినా రామా రామా అంటూ భగవన్నామ సంకీర్తనలే. భద్రాద్రి భక్తిభావంతో నిండిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామి వారి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం పట్టణంలోజగదేకవీరుడికి బ్రహ్మోత్సవాల సందడి గగనాన్ని తాకినట్లు భక్తులు భావించారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వచ్చిన జనంతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా దేవుడంటే నువ్వేలే రామయ్య తండ్రి అంటూ ఆలయ ప్రదక్షిణలు చేశారు.
రామకోటిని సమర్పించారు. హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీరామనామం మిన్నంటుతుండగా అగ్నిమధనం పరమానంద భరితం చేసింది. రెండు రకాల చెట్ల చెక్కలను కవ్వంలా రాపిడి చేయడంతో అగ్ని ప్రత్యక్షమైంది. రెండు కర్రల మధ్యలో పుట్టిన అగ్నిని హోమంలో వేసి అగ్ని ప్రతిష్టాపన చేశారు. యాగశాలలో గరుడ పటానికి ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడి నుంచి ఊరేగింపుగా పటాన్ని ధ్వజస్తంభం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ద్వజారోహణ చేశారు. ధ్వజ పటాన్ని స్తంభం పైన ఎగురవేసి బ్రహ్మోత్సవ శోభను పెంచారు. ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని గరుడ మూర్తికి అరగింపు చేశారు. ఈ ప్రసాదానికి ఎంతో విశిష్టత ఉండడంతో దీన్ని స్వీకరించేందుకు మహిళలు అమితాసక్తి కనబర్చారు. ఈ ప్రసాదం తింటే సత్ సంతానం కలుగుతుందన్నది నమ్మకం. దేవతలంతా ఒకటై వచ్చి సీతారాముల వారిని దీవించాలని దేవతాహ్వానం పలికారు.
సూర్య చంద్ర, ఇంద్ర దేవతలు ఈ కల్యాణోత్సవానికి రావాలని మంత్రోచ్ఛారణ రూపంలో పిలిచారు. వైదిక పరంగా భేరీ పూజ కొనసాగించారు. దేవదేవుడు తిరువీధి సేవలో దర్శనమిచ్చి మురిపించారు. ఇదిలా ఉండగా భద్రాచలం రామయ్యకు భక్తుల విరాళాల వెల్లువ కొనసాగుతుంది. హైదరాబాద్ కు చెందిన రాణి అనే భక్తురాలు మొక్కులో భాగంగా 250 గ్రాముల బంగారంతో భద్రాచలం రాముల వారికి కిరీటాన్ని తయారు చేయించారు. ఈ కానుకను తన బంధువు ద్వారా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి, ప్రధానార్చకులు సీతారామాను జాచార్యులు చేతుల మీదుగా సమర్పించారు. దేవుడి అలంకారంలో దీన్ని ఉపయోగించాలని దాత కోరారు. ఈవో రమాదేవి నేతృత్వంలో ఏఈవోలు శ్రావణ కుమార్,భవాని రామకృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana