Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
మంచి చదువులు చదువుకున్న మహిళలు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారు. అయితే నేటి జీవనశైలిలో వస్తున్న మార్పులకనుగుణంగా కుటుంబాన్ని పోషించాలంటే భార్యాభర్తలు ఇద్దరు పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి పెద్ద చదువులు చదువుకోని మహిళలకు ఉద్యోగ ఉపాధి ఎలా లభిస్తుంది. సాధారణ గృహిణి సైతం తమ కాళ్లపై తాము నిలబడే స్థాయికి చేరుకుంటేనే మహిళా సాధికారతకు అర్ధం చేకూరుతుంది. ఉన్నత చదువులు చదవలేని మహిళలు చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు నవభారత్ సంస్థ మహిళలకు సహాయ సహకారాలు అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వృత్తి విద్యల్లో రాణించేలా శిక్షణ ఇస్తుంది నవభారత్ సంస్థ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem) లో గ్రామీణ మహిళల అభ్యున్నతి కోసం ఆధునిక వసతులతో కూడిన మహిళ సాధికారిక భవనాన్ని ఏర్పాటు చేసింది నవభారత్ సంస్థ.
ఈ మహిళా సాధికారిక కేంద్రంగా ఆసక్తి గల మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, బ్యూటీషియన్, జ్యూట్ బ్యాగ్ తయారీ, శానిటరీ నాప్కిన్స్ తయారీ, తాటాకులతో కళాకృతుల తయారీ, ఇలా తదితర విభాగాల్లో ఉచిత శిక్షణ అందిస్తుంది. శిక్షణ సమయంలో మహిళలకు ఉపకార వేతనాన్ని సైతం నవభారత్ యాజమాన్యం అందిస్తుంది. ముఖ్యంగా ఈ కేంద్రంలో టైలరింగ్ శిక్షణ అనంతరం మహిళలు కుట్టిన బట్టలను చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శానిటరీ నాప్కిన్స్ తయారీ విభాగంలో తయారుచేసిన నాప్కిన్స్‌ని భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలకు ఉచితంగా అందిస్తున్నారు.
మరో విభాగమైన ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్న మహిళలు 3 నెలల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న అనంతరం వారే సొంతగా బోటిక్ ఏర్పాటు చేసుకొని రాణించడం విశేషం. వీటితో పాటు ఆసక్తిగల మహిళలకు బ్యూటీషియన్ విభాగంలో ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ తరగతుల్లో మహిళలకు ఫేస్ ప్యాక్ మొదలు మెహందీ వరకు అన్ని విభాగాలలో మెలుకువలు నేర్పుతూ ఈ కేంద్రంగా శిక్షణ పొందుతున్న మహిళలను ప్రొఫెషనల్ బ్యూటిషన్స్‌గా తీర్చిదిద్దుతున్నారు. మిగిలిన విభాగామైన తాటాకు బుట్టల అల్లికల్లో శిక్షణ అనంతరం మహిళలు తయారుచేసిన వస్తువులను మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ మహిళ సాధికారిక కేంద్రంగా ప్రతి ఏటా 60 లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ మహిళలకు శిక్షణ అనంతరం వారు తయారుచేసే పలు వస్తువులను దేశ విదేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు.
ఈ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకోవాలనుకునే మహిళలను కార్యాలయం పని వేళల్లో పట్టణంలోని నవభారత్ సెక్యూరిటీ కార్యాలయంలో సంప్రదించి ఉచితంగా అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ చెక్ చేసి అప్లికేషన్ నింపిన తర్వాత సెక్యూరిటీ ఆఫీసులో అందజేయాలి. అనంతరం సదరు దరఖాస్తుదారులను నవభారత్ యాజమాన్యం సంప్రదిస్తుంది. నవభారత్ యాజమాన్యం మహిళా సాధికారతకు కృషి చేస్తున్న విధానాన్ని గుర్తించిన ప్రభుత్వాలు సైతం పలు అవార్డులతో సత్కరించింది. వరుసగా రెండేళ్ల పాటు ఎక్స్‌లెన్సీ అవార్డులు అందుకుంది నవభారత్ సంస్థ. మరిన్ని వివరాలు కోసం సంస్థ పిఆర్ఓ శ్రీనివాస్ 8096999384 సంప్రదించ వచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana