Dasari Kranthi Kumar, News18.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు డైన శ్రీ సీతారామచంద్రస్వామి వారు కొలువుదీరిన భద్రాచలంలో గోదావరి నదీమ తల్లికి భక్తులు,అర్చకులు హారతులతో నీరాజనాలు పలికారు. భక్తులు ఎంతో పవిత్రంగా పూజలు నిర్వహించే కార్తీక మాసంలో బహుళ ద్వాదశి రోజున అందిన హారతి, పూజలతో గోదారమ్మ ఉప్పొంగింది. జై శ్రీ రామ్, జైజై శ్రీరామ్ నామస్మరణలు, బాణసంచాల వెలుగు దివ్వెలతో గౌతమీ తీరంతో పాటు దివ్యక్షే త్రం పులకించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి నది వద్ద జరిగిన 'పుణ్య నదీ హార తి'తో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది.
భద్రాచలం వద్ద గోదావరికి సీతారాములకు విడదీయరాని బంధం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. గౌతమీ మహర్షి వ్యవసాయం చేస్తుండగా గోవు ఆయన పొలంలోకి రాగా, ఆయన ఆవును అదిలిస్తూ తన చేతిలోని గరికను ఆవుపైకి విసురు తాడు. తపోబలం కలిగిన ఆ గరిక వల్ల గోవు మరణిస్తుంది. పశ్చాత్తాపం కలిగిన గౌతముడు గోహత్యా పాపాన్ని పోగొట్టుకునేందుకు ఆ గంగనే నేల మీదకు తీసుకొచ్చాడని, గో పాపాన్ని నివృత్తి చేసుకోవడానికి పుట్టింది కాబట్టే 'గోదావరి' అని, గౌతమీ మహర్షి రప్పించాడు కాబట్టే 'గౌతమీ నది'గా ప్రాచుర్యంలోకి వచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయని పండితులు పేర్కొంటున్నారు.
కార్తీక మాసంలో బహుళ ద్వాదశి రోజున గోదావరి మాతకు నదీ హారతి సమర్పించటం దశాబ్దకాలంగా ఆనవాయితీగా వస్తోంది.ఈ సందర్భంగా మేళ తాళాలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి పాదుకలను ఊరేగింపుగా తీసుకొచ్చి గోదావరి తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, అష్టోత్తర శతనామార్చన, చతుర్వే ద పారాయణం చేశారు. వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు కార్తీక మాసం, నదీ హారతి విశిష్టత గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి దంపతులు గోదావరి తల్లికి పసుపు, కుంకుమ, వస్త్రాలు సమర్పించారు. నది మధ్యలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పడవలో అర్చకులు ధ్వజ, కుంభ, అష్ట, నక్షత్ర, ద్వాదశ హారతులు ఇచ్చారు. భక్తులు సైతం గోదారమ్మకు దీపాలు సమర్పించి నమస్క రించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, ఏఈఓలు శ్రావణ్ కుమార్, భవానీ రామకృష్ణ, ఈఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Ganga river, Local News, Telangana