Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి (Bhadradri)మన్యంలో అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద జాతర ముత్యాలమ్మ వారి జాతర. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దుమ్ముగూడెం మండలం దుమ్ముగూడెంలో ఉన్న గ్రామ దేవత ముత్యాలమ్మ ఈ ప్రాంత వాసులకు కోరిన కోర్కెలు తీర్చే గ్రామ దేవతగా భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే తల్లిలా నిలుస్తుంది. బ్రిటిష్ కాలంలోనే నిర్మించబడిన ఈ ఆలయంలో మొట్టమొదటిసారిగా 1978 సంవత్సరంలో జాతర నిర్వహించారు. ఆనాటి నుండి నేటి వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. తొమ్మిది రోజులు జరగబోయే ఈ జాతరలో సుమారు లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు.
ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 14 వరకు అంగరంగవైభవంగా ముత్యాలమ్మ అమ్మ వారి జాతరను నిర్వహించడానికి ఆలయ కమిటీ చైర్మన్ చుక్కా గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రతి ఏడాది గ్రామదేవత ఉత్సవాన్ని 9 రోజుల పాటు వైభవోపేతంగా జరపటం అనవాయితీగా వస్తోంది. ప్రతి రోజు సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించటం ఈ జాతర ప్రత్యేకత. ఇందులో భాగంగా ఆలయానికి రంగులు, పందిళ్లు వేసే పనులను ఇప్పటికే పూర్తి చేశారు. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర సోమవారం ప్రారంభం రోజున ఉదయం 11గంటలకు పొలిమేర కట్టడం, సాయంత్రం అఖండ దీపారాధన, పుట్టమన్ను తీసుకొని వచ్చి ఉత్సవాలను ప్రారంభించారు. గత ఏడాది కోవిడ్ -19 నియమాల దృష్ట్యా గతంలో ప్రతి రోజు నిర్వహించే అన్నదానం కార్యక్రమం నిలిపివేశారు.
ఈ ఏడాది ప్రతి జాతరకు ఏర్పాటు చేసినట్టే జాతర 9 రోజులు అన్నదానం ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను ఆలయ కమిటీ చూస్తున్నారు. ఇదిలా ఉండగా ముత్యాలమ్మ అమ్మవారి 9 రోజుల జాతరలో భాగం గా 3వ రోజు, 6వ రోజు, 9వ రోజు గ్రామ పురవీధుల్లో గరిగెలతో ఊరేగింపును నిర్వహిస్తారు. ఈ జాతరలో ఊరేగింపు కార్యక్రమాలే ప్రత్యేకత.ఊరేగింపులో గ్రామంలోని యువకులు ఆడవారిగా వేషధారణ వేసుకుని అమ్మవారి గరిగెలను తలపై ఉంచుకుని గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి నైవేధ్యాలను స్వీకరిస్తారు. ఊరేగింపునకు ఆలయం నుంచి బయలుదేరే ముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆలయంలోని ధ్వజస్తభంపై ఉన్న గంటలు మోగడం అమ్మవారి నిజరూపానికి దర్శనం. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారికి ప్రత్యేకత ఉంది. దీనిలో భాగంగా అమ్మ వారి ఊరేగింపులో ఇంటి మందుకు వచ్చే గరిగెలకు పూజలు చేసి భక్తలు తమ కోర్కెలను కోరుకుంటారు.
ఆఖరి రోజు ఊరేగింపులో కోయ వారి కొమ్ము నృత్యం, బేతాళా సెట్ బృందం, కింగ్ కాంగ్, రాక్షసి బొమ్మలు, డప్పువాయిద్యాలతో నిర్వహించే ఊరేగింపు జాతరకు హైలెట్ గా నిలుస్తాయి. అలాగే భారీ ఎత్తున నిర్వహించే బాణాసంచా కాల్చడం ఆహుతులను కళ్లు తిప్పుకోకుండా చేస్తాయి. అంతేకాకుండా ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో తొమ్మిది రోజుల రాత్రి సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమా లను నిర్వహించనున్నారు. ఈ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మ్యూజికల్ నైట్, చిల్డ్రన్స్ డాన్స్ బేబిడాన్స్, అంధుల మ్యూజికల్ అర్కెస్ట్రా నిర్వహిస్తుంటారు. 2019లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, సింగర్ ధనుంజయ్ పాల్గోని ఆహుతులను అలరించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది యూట్యూబ్ సంచలనం పల్సర్ బైక్ సింగర్ రమణ, పల్సర్ బైక్ సాంగ్ డాన్సర్ కండక్టర్ ఝాన్సీలు తమ టీంలతో జాతరలో పాల్గొంటారు. ఇదిలా ఉండగా ముత్యాలమ్మ అమ్మవారి జాతర తొమ్మిది రోజులు ఆలయానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఆలయ కమిటీ ఏర్పాటు చేస్తుంది. కరోనా సమయంలో తప్ప ప్రతి జాతరకూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనవాయితీగా వస్తుంది. దాతలు అమ్మవారి జాతరలో అన్నదానం చేయడానికి విరివిగా ముందుకు వచ్చి చేయూతనందిస్తుంటారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నప్పటీకి ఎటువంటి అవాంతరాలు జరుగకుండా చేపట్టడం అమ్మవారి మహిమకి నిదర్శనం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana