హోమ్ /వార్తలు /తెలంగాణ /

భద్రాద్రి రామాలయ భూములపై ముదురుతున్న వివాదం.. రంగంలోకి వీహెచ్‌పీ

భద్రాద్రి రామాలయ భూములపై ముదురుతున్న వివాదం.. రంగంలోకి వీహెచ్‌పీ

X
ముదురుతున్న

ముదురుతున్న భద్రాచలం భూ వివాదం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి (Bhadrachalam Temple) సంబంధించిన భూముల విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధ వాతావరణం నెలకొన్నది.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam, India

Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem 

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి (Bhadrachalam Temple) సంబంధించిన భూముల విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధ వాతావరణం నెలకొన్నది. గత రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ వ్యవహారాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తకోటి నిశితంగా గమనిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో భద్రాద్రి పట్టణానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం అనే గ్రామంలో భద్రాద్రి రాముల వారి పేరుపై 917 ఎకరాల భూమిని పురుషోత్తమ దాస్ అనే రైతు ధూపదీప నైవేద్యాల నిమిత్తం భద్రాచల దేవస్థానానికి విరాళంగా ప్రకటించాడు. తదనంతరం ఈ భూమిపై సర్వహక్కులు దేవస్థానానికి చెందుతాయంటూ వీలునామ సైతం రాసి అందజేశాడు. అనంతరం పలు అవసరాలకు దేవస్థానం భూమిని కేటాయించిన పెద్దలు మిగిలిన 889.50 ఎకరాల భూమిపై సర్వహక్కులు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం పేరునే ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన అనంతరం దేవస్థానం భద్రాచలంలోని తెలంగాణ ప్రాంతంలోనూ, భూములు మాత్రం పురుషోత్తపట్నం, (అల్లూరి సీతారామరాజు జిల్లా) ఆంధ్ర ప్రాంతానికి కేటాయించబడింది. సరిగ్గా ఇక్కడే వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. రాష్ట్ర విభజనకు ముందునుంచి కౌలు కడుతూ వస్తున్న సదరు రైతులు.. రాష్ట్ర విభజన అనంతరం కౌలు కట్టడం ఆపివేయడంతో వివాదం ప్రారంభమైంది.

ఇది చదవండి: 30 ఏళ్లుగా పేద విద్యార్థులకు అండగా తన జీతంలో సగం సేవకే ఇస్తున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి

ఇలా ప్రారంభమైన వివాదం చివరికి భూములు మావంటే మావంటూ దేవస్థానం అధికారులు, పురుషోత్తపట్నం రైతులు కోర్టులను సైతం ఆశ్రయించారు. కోర్టు పరిధిలో కేసులు ఉన్న సందర్భంలోనే రామాలయం భూములు రక్షించుకునేందుకు మేము సైతం సిద్ధమంటూ విశ్వహిందూ పరిషత్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఇటీవలే రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ నాయకులు భద్రాచలం విచ్చేసి స్థానిక స్థానిక కళ్యాణ మండపంలోని దేవస్థాన కార్యనిర్వాహణ అధికారితో సమావేశమై భూముల విషయంలో నిజ నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

ఇది చదవండి: మమ్మల్ని మనుషులుగా గుర్తించండి మహాప్రభో.., కనీస సౌకర్యాలకు నోచుకోని గిరిజనులు

అంతేకాక భూముల విషయం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో అసలు భద్రాచల దేవస్థానం అధికారుల వద్ద ఉన్న ఆధారాలను వీ‌హెచ్‌పీ నాయకులు పరిశీలించారు. అనంతరం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి రాముల వారి భూమిని అన్యాయంగా పలువురు కబ్జాలు చేశారని వెంటనే భూములు ఖాళీ చేయకపోతే ఆందోళనకు సిద్ధమవుతామని హెచ్చరించారు. రాముల వారి భూములను సెంటు కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని భూములని భద్రాచలం రామయ్య పేరునే ఉన్నందున రామయ్య ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని హెచ్చరికతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు సైతం పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించి విశ్వహిందూ పరిషత్ సభ్యుల తీరును విమర్శించారు.

గతంలోనే నైజాం నవాబుల కాలంలో వరంగల్ కేంద్రంగా పలువురు కలప వ్యాపారులకు ఈ భూములను అమ్మడం జరిగిందని, వారి వద్ద నుంచి ప్రస్తుతం ఉన్న పురుషోత్తపట్నం రైతుల పూర్వీకులు కొనుగోలు చేసినట్లు స్థానిక రైతులు వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని నిజానిజాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదంటూ విశ్వహిందూ పరిషత్ నాయకులను హెచ్చరించారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో భూములలో పర్యటించి నిజం ఏంటో తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఇలా దేవస్థానం పురుషోత్తపట్నం రైతులకు గత కొంతకాలంగా జరుగుతున్న వివాదంలో ప్రస్తుతం విశ్వహిందూ పరిషత్ సభ్యులు దేవస్థానానికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ భూముల పై మరోసారి తీవ్రస్థాయిలో చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

First published:

Tags: Bhadrachalam, Local News, Telangana

ఉత్తమ కథలు