తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్(BRS)తో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న ఆయన.. నెక్ట్స్ ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు..? కాషాయ (BJP) కండువా కప్పుకుంటారా? లేదంటే కాంగ్రెస్(Congress) గూటికి చేరుతారా? దీనిపైనే రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ పొంగులేటి మాత్రం అనూహ్యంగా వైఎస్ఆర్టీపీ(YSRTP) వైపు అడుగులు వేస్తున్నారు. షర్మిల పార్టీలో చేరేందుకు మొగ్గు చూప్తున్నారు. ఇప్పటికే ఓసారి వైఎస్ షర్మిల (YS Sharmila)తో సమాశమైన ఆయన.. తాజాగా వైఎస్ విజయమ్మ (YS Vijayamma)తో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీలో చేరికపైనే ఆమె మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
వైఎస్ విజయమ్మ ఈ నెల 8న పాలేరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఫిబ్రవరి 8నే పార్టీలో చేరాలా? లేదంటే షర్మిల పాదయాత్ర ముగింపు సభలో చేరాలా? అనే దానిపై విజయమ్మతో చర్చించినట్లు సమాచారం. ప్రజాప్రస్థానం పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్ర.. పాలేరులో ముగుస్తుంది. పాదయాత్ర ముగింపు సభలో.. షర్మిల-విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకూ బీజేపీ వైపు మొగ్గూచూపిన ఆయన.. ఇప్పుడు వైఎస్సాఆర్టీపీ దగ్గరవడం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటికి షర్మిల భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరితే సముచిత స్ధానం కల్పిస్తామని హామీ ఇచ్చారట. ఈ క్రమంలోనే ఆయన వైఎస్ఆర్టీపీలో చేరేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయనకు కాకుండా.. నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ టికెట్ దక్కింది. ఆ తర్వాత పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని చెప్పినా.. అది జరగలేదు. ఇన్నాళ్లు ఎదురుచూసిన పొంగులేటి.. ఇప్పుడు ఓపిక నశించి.. బీఆర్ఎస్‌కు ఎదురు తిరిగారు. కేసీఆర్‌ను నమ్ముకుంటే..నట్టేట ముంచారని.. బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
పొంగులేటి బీజేపీలో చేరుబోతున్నారని.. ఫిబ్రవరిలో ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి.. కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నారట. ఇప్పుడు వైఎస్సార్టీపీలోకి వెళ్లాని నిర్ణయించుకున్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Khammam, Local News, Ponguleti srinivas reddy