తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం (Khammam Politics) రాజకీయాలు కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు.. ఆధిపత్య పోరు... ఆసక్తికరంగా మారాయి. పార్టీ పట్ల సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తుమ్మలను బుజ్జగిస్తున్న అధిష్టానం.. పొంగులేటిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో చర్చిస్తున్నారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ (BRS)కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన అనూహ్యంగా ఆయన వైఎస్ షర్మిల (YS Sharmila)తో భేటీ కావడం... ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వైఎస్ఆర్తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ హైమాండ్‌పై తీవ్రమైన అసంతృప్తితో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇప్పుడు షర్మిలతో సమావేశమవడం.. ఉమ్మడి ఖమ్మంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పొంగులేటికి షర్మిల భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరితే సముచిత స్ధానం కల్పిస్తామని హామీ ఇచ్చారట. ఐతే దీనికి పొంగులేటి కొన్ని షరతులను విధించారని సమాచారం. వాటికి షర్మిల అంగీకరిస్తే.. వైఎస్ఆర్టీపీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక లాంఛనమేనన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
CM Kcr-New Secretariat: కొత్త సచివాలయం నిర్మాణం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్
రెండు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం ఇల్లెందులో జిల్లా జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య నిర్వహించిన ఆత్మీయ సమ్మేనళంలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. 2014లో టీఆర్ఎస్ పెద్దలే తనను పార్టీలోకి ఆహ్వానించారని.. వారిని నమ్మి తన పార్టీని విలీనం చేశానని అన్నారు. కానీ ఆ తర్వాతి ఎన్నికల్లో తనకు ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. తనకుగానీ.. తనను నమ్ముకున్న వారికి గానీ.. ఇబ్బంది పెడితే.. గాంధేయ మార్గంలోనే అధికార బలానికి ఎదురెళ్తానని హాట్ కామెంట్స్ చేశారు పొంగులేటి. అంతేకాదు సాయంత్రమయ్యాక.. ఏ గూటి పక్షులు ఆ గూటికే వెళ్తాయని అన్నారు. ఆ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఆయన షర్మిలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీగా పొంగులేటికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు షర్మిలతోనూ ఇప్పటికీ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు పొంగులేటి బీజేపీలో చేరుబోతున్నారని.. ఫిబ్రవరిలో ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి.. కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని తెలుస్తోంది. మరి దీనికి కారణమేంటో తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Local News, Ponguleti srinivas reddy, YS Sharmila