Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
పంచవటిగా కీర్తింపబడుతున్న పర్ణశాల దేవస్థానంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి (Bhadrachalam Temple) అనుబంధంగా ఉన్న ఆలయంలో పలు కారణాలవల్ల గాలిగోపురాలపై ఉన్న కలశాలు ధ్వంసమైన నేపథ్యంలో తిరిగి వాటి స్థానంలో నూతన కలశాలను శాస్త్రయతంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామాంజనేయ చార్యులు ఆధ్వర్యంలో వైదిక బృందం పలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమం, సంరక్షణ తదితర కార్యక్రమాలు నిర్వహించి నేటి ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు పునప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పర్ణశాల దేవాలయంలో ఉన్న ఈ యాగశాలలో హోమాన్ని నిర్వహించగా, ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం శాంతి కళ్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి దేవస్థానం సూపరిండెంట్ నిరంజన్ పాల్గొనగా పర్ణశాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకోగా అర్చక స్వాములు తీర్థప్రసాదాలను అందించారు.
ఇదిలా ఉండగా సీతారామచంద్ర స్వామి వారు మొదటిగా అయోధ్య నుంచి పర్ణశాలకు వచ్చి పంచవటి అని పిలవబడే ఈ ప్రాంతంలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని సీతా లక్ష్మణ సమేతంగా వనవాసాన్ని పూర్తి చేసినట్లు చరిత్ర పురాణాలు చెబుతున్నారు. సీతారాములు ఉన్న కుటీరమే పర్ణశాల. దాదాపు వాళ్ల వనవాసంలోని చాలా సమయం ఇక్కడే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది. సీతమ్మవారు గోదావరిలో స్నానం చేసి, పర్ణశాల పక్కనున్న ‘రాధగుట్ట’పై చీర ఆరేసుకుందని అంటారు. ఇప్పుడు ఆ చోటుని నార చీర గురుతుల స్థలం అని అంటారు. పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటరు ముందే ఈ రాధగుట్ట ఉంది. ఇక్కడ ఇప్పుడు కూడా అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి. రాధగుట్ట పక్కనే మీకు లక్ష్మణుడు, శూర్పణఖల మధ్య సంఘర్షణ జరిగిన ఒక చిన్న గుట్ట ఉంది. ఇవన్నీ ఇప్పుడు పర్యాటక స్థలాలు.
భద్రాద్రి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పర్ణశాల గ్రామంలో కలదు. ఇదిలా ఉండగా పర్ణశాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అధికారులు సుమారు రూ.16.63 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి పంపగా ఇటీవలే భద్రాచలంలో పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము భద్రాచలం ఆలయ అభివృద్ధితో పాటు పర్ణశాల ఆలయ అభివృద్ధి కూడా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం కాటేజీల నిర్మాణంతోపాటు సీతవాగు పర్ణశాల కుటీరం తదితర ఆధ్యాత్మిక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana