Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
అమృత్ భారత్ పథకం (Amrith Bharath Scheme) లో భాగంగా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను ఆధునికరించి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్ లో ఇరవై స్టేషన్లను ఎంపిక చేయగా, ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam) లోని మూడు స్టేషన్లకు స్థానం లభించింది. ఈ పథకం ద్వారా మూడు స్టేషన్లలో డ్రెయినేజీలు మొదలుకొని వైఫై వరకు అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా అమృత్ భారత్ పథకంలో ఎంపికైన స్టేషన్లలో ప్లాట్ ఫారాలను ఆధునికీకరిస్తారు. ప్రస్తుతం ఈ స్టేషన్ల లో ప్లాట్ఫామ్స్ ఎత్తు 76 సెం.మీ. ఉండగా దాన్ని 84 సెం.మీ.కు పెంచుతారు. ఫలితంగా రైలు ఎక్కడం, దిగడం మరింత సులువవుతుంది.
గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉన్న ఖమ్మం, మధిర స్టేషన్లలో ప్లాట్ఫామ్స్ 24 బోగీల రైలు ఆగేందుకు అనువుగా సుమారు 600 మీటర్ల పొడవుతో ఉన్నాయి. ఎక్కడైనా ప్లాట్ఫామ్ పొడవు తక్కువగా ఉంటే వాటిని పెంచనున్నారు. ఇక కొత్తగూడెం రైల్వేస్టేషన్లో 18 నుంచి 21 బోగీలు రైలు నిలిపేందుకు అనువుగానే ప్లాట్ఫామ్స్ ఉండగా, 24 బోగీల రైలు నిలిపేందుకు వీలుగా తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఖమ్మం, మధిర, భద్రాచలంరోడ్డు స్టేషన్లలో సాధారణ ప్రయాణికులు, రిజర్వ్, ఉన్నత శ్రేణి(ఏసీ) ప్రయాణికులకు వెయిటింగ్ హాళ్లు ఉన్నాయి. అయితే స్టేషన్లో స్థల లభ్యత ఆధారంగా అక్కడక్కడా ఉన్నాయి. అమృత్ భారత్ లో భాగంగా అన్ని వెయిటింగ్ హాళ్లను ఒకే దగ్గర ఉండేలా నిర్మాణం చేపడుతారు. వీటికి దగ్గర్లోనే కేఫీరియా ఉండేలా కొత్తగా స్టేషన్ డిజైన్ చేస్తారు. అంతేకాక టీసీల ప్రత్యేక వెయింగ్ హాల్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్లాట్ఫామ్స్, వెయిటింగ్ హాళ్లలో ఉన్న ఫర్నిచర్ను నేటి ట్రెండు తగ్గట్టుగా మారుస్తారు. ప్రయాణికులు ఎదురుచూసే, కూర్చునే స్థలాల్లో మొబైల్ ఫోన్ల చార్జింగ్కు అనువుగా సాకెట్లు, హోల్డర్లు ఏర్పాటు చేస్తారు. అలాగే, రద్దీ ఆధారంగా మొబైల్ చార్జింగ్ ఏరియాను అందుబాటులోకి తెస్తారు. అవసరమైన చోట ప్రస్తుతం ఉన్న సిమెంట్ బెంచీలు, ఇనుప కుర్చీలకు బదులు కంఫర్టబుల్ మల్టీ యుటిలిటీ ఫర్నిచర్ ఏర్పాటు చేస్తారు.
అంతేకాకుండా ఎంపిక చేసిన స్టేషన్లలో పార్కింగ్ ఏరియాను కూడా పూర్తిగా ఆధునికీకరించి.. బస్ బే, ఆటో బేలను ఏర్పాటు చేస్తారు. స్టేషన్ ఆవరణలోని రావడం వెళ్లే మార్గాలను సూచిస్తూ సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తారు. స్టేషన్ ఆవరణలో లైటింగ్ వ్యవస్థ, గ్రీనరీని కూడా కొత్తగా డిజైన్ చేస్తారు. వీటితో పాటు అవసరమైన చోట రోడ్ల వెడల్పు, పాదచారులు నడిచేదారులు నిర్మిస్తారు. అంతేకాక స్టేషన్ లో నిరుపయోగంగా ఉన్న కట్టడాలను తొలగించడంతో పాటు డ్రెయినేజీ వ్యవస్థలో మార్పులు చేపడతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Indian Railways, Local News, Telangana