హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ జిల్లాలో నీళ్లు నిల్.. లిక్కర్ మాత్రం ఫుల్.. సందు సందులోనూ మందు

ఆ జిల్లాలో నీళ్లు నిల్.. లిక్కర్ మాత్రం ఫుల్.. సందు సందులోనూ మందు

భద్రాచరంలో పెరిగిపోతున్న బెల్టు షాపులు

భద్రాచరంలో పెరిగిపోతున్న బెల్టు షాపులు

Bhadradri: గుక్కెడు మంచినీళ్లు దొరకడమైనా కష్టమైన చోట కూడా మందు మాత్రం అందుబాటులో ఉండేలా మద్యం సిండి 'కేటుగాళ్లు' ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు ఏర్పాటు చేసి మరీ చేస్తున్న 'యాపారం' అడ్డగోలుగా మారి మధ్యతరగతిని దోపిడీ చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bhadrachalam | Telangana

గుక్కెడు మంచినీళ్లు దొరకడమైనా కష్టమైన చోట కూడా మందు మాత్రం అందుబాటులో ఉండేలా మద్యం సిండి 'కేటుగాళ్లు' ఎక్కడ పడితే అక్కడ బెల్టుషాపులు ఏర్పాటు చేసి మరీ చేస్తున్న 'యాపారం' అడ్డగోలుగా మారి మధ్యతరగతిని దోపిడీ చేస్తున్నారు. "ఇంట్లో బియ్యం లేకపోయినా ఫర్వాలేదు గానీ, సాయంత్రానికి గొంతు తడవకపోతే ఏ మాత్రం ఆగలేం..." అన్నంతగా బానిసలైన మందుబాబుల జేబులు గుల్లచేస్తూ మద్యం సిండికేటు దోపిడీ యధేచ్ఛగా సాగిపోతోంది. ఇంకేముందీ సాటిరానంత ఆదాయం ఒక్క మద్యంలోనే వస్తుండటంతో విపరీతమైన సంపాదనకు అలవాటు పడిన మద్యం వ్యాపారులు తమ ఆలోచనలకు పదును పెట్టి రోజు రోజుకూ కొత్తరకమైన ఆలోచనలకు తెరతీస్తున్నారు. అధికారిక మద్యం షాపులలో అతి తక్కువ బిజినెస్ చేస్తూ, మద్యాన్ని అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు యధేచ్ఛగా 'బెల్టుషాపుల'ను ప్రోత్సహిస్తున్నారు.

ఈ లెక్కన అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులతో ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం (Bhadrachalam) పట్టణంలోని ఐటీడీఏ రోడ్డులో ఉన్న ఓ వైన్ షాపును తనిఖీ చేసిన 'ప్రత్యేకాధికారులు' సీజ్ చేశారు. మరి తమ కార్యాలయం ఉన్న పట్టణంలోనే తమకు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే ఆషాపులో జరుగుతున్న అక్రమ వ్యాపారాన్నే స్థానిక ఎక్సైజ్ అధికారులు ఎందుకు తనిఖీ చేయడం లేదో? తనిఖీలు చేసినప్పుడైనా అక్రమాలు ఎందుకు గుర్తించలేపోతున్నారో? జగమెరిగిన సత్యమే. వైన్స్ సిండికేటు చేసే దోపిడీ ఎంత దారుణంగా ఉంటుందనేది ఓ సారి విశ్లేషించి చూస్తే, పేద, మధ్యతరగతి మందుబాబుల జేబులు ఏస్థాయిలో లూటీ చేస్తున్నారనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇది చదవండి: ఆ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది..? ఆ నేతపై తిరుగుబాటు ఎందుకు..?

ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీలు అమ్మాల్సిన వైన్ షాపులు, తమ వ్యాపారం అత్యధిక లాభసాటిగా మార్చుకునేందుకు బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారు. బీరు ఎమ్మార్పీ ధర రూ. 180 ఉండగా, అధికారిక వైన్ షాపులో బీర్లు దొరకడం లేదు. అసలు దొరకకుండా చేస్తున్నారనేది వాస్తవం రూ.180 ధర ఉన్న బీరును వైన్స్ సిండికేటు ఏకంగా రూ.220 ధరకు బెల్టుషాపులకు సరఫరా చేస్తోంది. అంటే ఎమ్మార్పీ ధరకు అమ్మితేనే అత్యధికంగా లాభాలు వచ్చే బీరును బ్లాక్ చేసి ఏకంగా రూ.40 ఎక్కువకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వైన్ సిండికేటు నుంచి రూ.220కి కొనుగోలు చేసుకున్న ఆ బెల్టుషాపులు ఏకంగా రూ.260కు అమ్మక పోతే గిట్టుబాటు కావడంలేదని చెప్తున్నారు. అంటే మందుబాబులు ఒకే ఒక్క బీరులోనే ఏకంగా రూ.80 నష్టపోతున్నారు.

ఇది చదవండి: కొత్త సాగువైపు రైతుల చూపు.. లాభాల ఎలా ఉన్నాయంటే..!

రూ.140 ఉన్న ఓయా రూ. 160కి బెల్టుషాపులు వారికి సిండికేటు నుంచి అమ్ముతుంటే వారి నుంచి ప్రజలకు రూ.190కి అమ్ముతున్నారు. అంటే ఈ మద్యం ఒక్క సీసాకు రూ.50 అధికంగా ఖర్చు పెట్టుకుని తాగుతున్నారు. ఐబీ అని పిలిచే మద్యం సీసాకు రూ.220 ఎమ్మార్పీ ధర ఉండగా, అది వినియోగదారుడికి చేరే వరకు రూ.40 అదనం దోచుకుంటున్నారు. ఇక మాన్షన్ హౌస్ సీసాకు ఎమ్మార్పీ ధర రూ. 210 ఉండగా, రూ.260 ధరకు బెల్టుషాపులో కొనుక్కుని తాగుతున్న దుస్థితి ఏర్పడింది. ఇలా ఏ రకం మద్యంలో అయినా రూ. 40నుంచి రూ. 60వరకు అధిక ధరలతో దోచుకుంటున్నారు. అధికారికంగా లైసెన్సు ఇచ్చిన మద్యం షాపుల్లోనే మందు అమ్మకాలు జరిగితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, బెల్టుషాపులు ద్వారా అమ్మినా వచ్చే ఆదాయం మాత్రం ఒక్కటే కావడం గమనార్హం.

అంటే ప్రభుత్వాధికారులు తమ స్వార్ధం కోసం చూసీచూడనట్లుగా ఉండటం వల్ల మద్యానికి అలవాటు పడిన నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతు న్నారు. దీని ప్రభావంతో ప్రజలలో ఆర్థిక, సామాజిక అసమాన తలకు కారణం అవుతోంది. ఇటీవల ప్రభుత్వం ఎందుకనో బెల్టుషాపులు మాయించాలనే ఆదేశాలతో కాస్త హడావిడి చేసినప్పటికీ, భద్రాచలం ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ యధాతథంగా మారాయి. అధికారికంగా 16 వైన్ షాపులు, ఒక బార్ ఉన్న భద్రాచలం సర్కిల్ పరిధిలో ఏకంగా 500 వరకు బెల్టుషాపులున్నాయి. ఈ మధ్య అధికారులు చేసిన హడావుడిలో వీటిలో దాదాపు ఓ 50 వరకు మూసేశారని తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇటీవల తాము దాడులు చేసి 10కి పైగానే బెల్టుషాపులు మూయించామని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో బెల్టు షాపుల ద్వారా వైన్స్ సిండికేటు అక్రమాలు ఆపేందుకు, అమాయక మందుబాబులు నష్టపోకుండా నివారించేందుకు ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, మేథావులు కోరుతున్నారు.

First published:

Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు