Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో ప్రతి ఏటా లోకకళ్యాణార్థం జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణ వేడుకలలో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. భారతదేశంలో ఎన్ని మతాలు, సాంప్రదాయాలు ఉన్నా హిందూ ధర్మానికి సంబందించిన వారు ఆరాధించే ఏకైక దైవం శ్రీరాముడే. శ్రీరామ చంద్రుని ప్రధాన క్షేత్రాలు రెండు ఉండగా ఉత్తర భారతదేశంలో అయోధ్య, దక్షిణ భారతదేశంలో భద్రాచలంలో ఉన్నప్పటికి భద్రాచలంరాముడి కళ్యాణానికి ప్రసిద్ది. రాష్ట్రంలో వైష్ణవ ఆలయాలలో చేసే కళ్యాణ విధానం భద్రాచలం క్షేత్రాన్ని బట్టే రూపొందించుకున్నారు. అంత గొప్ప విధానంతో అత్యంత వైభవంతంగా భద్రాచల క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణానికి ఎంతో విశిష్టత ఉంది.
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరపున ప్రతియేటా స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, మంగళసూత్రాలను అందించడం ఆనాటి నిజాం ప్రభువు తానీషా కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది. వైదిక విధానం ప్రకారం పంచమ ఆగమశాస్త్రం చెప్పిన విధంగా శ్రీవైష్ణవ సాంప్రదాయానికి అనుగుణంగా స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం మరునాడే స్వామి వారికి పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఓంకార రాముడు, వైకుంఠ రాముడు, రామ నారాయణుడు అనే విలక్షణ నామత్రయంతో విరాజమానుడైన భద్రాచల రామచంద్ర మహాప్రభువు వారి కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉన్నది. జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముడి దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా.. ఇరముల మెరిసిన సీతారాముల కల్యాణము చూతము రారండి’ అంటూ సీతా రాముల కల్యాణంలో తలంబ్రాల విశిష్టతను వివరించారో సినీ రచయిత.
శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే శ్రీసీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్తులు పునీతులవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామి వారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తారు. స్వామి, అమ్మవారి నుదుటిపై జాలు వారే తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని వారి విశ్వాసం. అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ప్రతి ఏడాది పెరుగుతోంది. అక్షతలు అంటే శాశ్వతమైనవని, నశించిపోని సుఖాలను కలుగజేసేవని పండితులు చెబుతున్నారు.
వధూవరులు జీవితాంతం ఒకరికొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని, అయితే ఆది దంపతులైన సీతా రాముల శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు. ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనసుకు అధిపతి. మనసుకు ప్రశాంతత కలిగించేవాడు చంద్రుడు గనుక అతడికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారు. ఆలుమగల దాంపత్యం మనసుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకోవడం ద్వారా వారి మధ్య మరింత అనురాగం పెంపొందుతుందని, అన్యోన్యంగా జీవించడానికి ప్రతీకగా భద్రాచలంలో ముత్యాల తలంబ్రాలను శ్రీ సీతారాముల తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తామని పండితులు వివరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana