Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో స్వామివారి కల్యాణ మహోత్సవానికి ఉపయోగించే తలంబ్రాలు నిమిత్తం గోటి తలంబ్రాలు సమర్పించేందుకు రాష్ట్ర నలుమూలలు నుంచి రామ భక్తులు భద్రాచలం (Bhadrachalam) చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) భద్రాచలం పట్టణంలో మార్చి 30వ తేదీన మిధున స్టేడియం ఆవరణలో శ్రీ సీతారాముల కల్యాణమైన శ్రీరామ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కల్యాణ సమయంలో స్వామి వారికి ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు ఎంతో విశిష్టతను సంతరించుకున్నారు. ఇదిలా ఉంచితే ముత్యాల తలంబ్రాలకు ఉపయోగించే బియ్యాన్ని సైతం రామభక్తులు గోటితో ఒలిచి భద్రాద్రి ఆలయానికి సమర్పిస్తుండడం ఆనవాయితిగా వస్తున్న అంశం.
ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పలు రామ భక్తి బృందాలు 40 నుంచి 45 రోజులపాటు ప్రత్యేకంగా ఆర్గానిక్ పద్ధతుల ద్వారా వరి సాగు చేసి అనంతరం వడ్లను అత్యంత భక్తి పారవశ్యంతో నూర్పిడి చేసి గోటితో బియంగా మార్చి భద్రాచలానికి కాలినడకన వచ్చి రామాలయ దేవస్థానానికి సమర్పిస్తుంటారు. ఇందులో భాగంగా హోలీ పౌర్ణమి సమర్పించుకొని భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీరామనవమి (Sri Rama Navami) నాడు జరగబోయే సీతారాముల కళ్యాణం పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా తలంబ్రాలు తయారు చేసే కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా హోలీ నుంచే ప్రారంభించనున్న తరుణంలో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామభక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు.
ఇప్పటికే వందకు పైగా వివిధ ప్రాంతాల నుంచి బృందాలుగా రామభక్తులు భద్రాచల పట్టణానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ఆయా ప్రాంతాల నుంచి తెచ్చిన గోటి తలంబ్రాలను ఆలయ అధికారులకు అందజేస్తున్నారు. భక్తులు సమర్పించిన ఈ గోటి తలంబ్రాలను సేకరించిన ఆలయ అధికారులు రాబోయే శ్రీరామనవమి వేడుకలలో ఈ తలంబ్రాలను వినియోగిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన రామ భక్త బృందం సభ్యులు న్యూస్ 18తో మాట్లాడుతూ.. సుమారు 45 రోజుల క్రితం స్వామివారి గోటి తలంబ్రాలు నిమిత్తం ప్రత్యేకంగా వరి సాగు చేసినట్లు వారు తెలిపారు.
అంతేకాకుండా ఆర్గానిక్ పద్ధతిలో సాగిన ఈ పంటలో పండిన వడ్లను స్వయంగా కోసి నూర్పి గోటితో బియ్యంగా మార్చి పాదయాత్ర చేసుకుంటూ భద్రాచలం చేరుకుని స్వామివారికి గోటి తలంబ్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఏడాది సుమారు 300 మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి పదివేల మందికి పైగా భక్తులు భద్రాచలం చేరుకొని స్వామివారికి గోటి తలంబ్రాలను సమర్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana