(G.SrinivasReddy,News18,Khammam)
టీఆర్‌ఎస్(TRS)లో కుమ్ములాటలు మొదలయ్యాయి. రాష్ట్ర స్థాయి నేతల మధ్య అప్పుడప్పుడు బయటపడుతున్న విబేధాలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమిస్తుండగా.. ఇవి చాలవన్నట్టు ద్వితీయ శ్రేణి నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ భవితవ్యం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎక్కడికక్కడ మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో నేతల మధ్య విబేధాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా కొత్తగూడెం(Kothagudem), ఇల్లందు (Yellandu)మున్సిపల్ ఛైర్మన్లు వర్సెస్ కౌన్సిలర్లు అన్నట్టుగా వివాదం సాగుతోంది. ఇది సహజంగానే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. వీరి మధ్య వివాదంలో తలదూర్చడానికి సైతం ఎమ్మెల్యేలు సాహసించలేని స్థాయిలో వివాదం ముదిరిపోయింది. దీంతో అటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao),ఇటు ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్(Haripriyanayak)లకు కంటిమీద కునుకుకూడా లేని పరిస్థితి నెలకొంది. కలసికట్టుగా జట్టుగా పనిచేయాల్సిన మున్సిపల్ కౌన్సిల్‌లో ఇలా అధికార పార్టీ వాల్లే ఒకరిపై ఒకరు పిటిషన్లు పెట్టుకుని బహిరంగంగా దూషణలకు పాల్పడుతుంటే ఇక పార్టీ పరువు, భవిష్యత్తు కష్టమేనంటూ కింది స్థాయి నేతలు పెదవి విరుస్తున్నారు.
కారు పార్టీలో కలహాలు ..
భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ ఛైర్‌పర్సన్ కాపు సీతామహాలక్ష్మి నిరంకుశ పోకడలకు పోతున్నారంటూ ఆ పార్టీకే చెందిన వైస్ ఛైర్మన్, కొందరు కౌన్సిలర్లు గత వారంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఫిర్యాదు చేశారు. పనుల కేటాయింపులో, నిధుల మంజూరులో వివక్ష చూపుతున్నాంటూ నిరసనకు దిగారు. దీనిపై గతంలోనూ పలుమార్లు తమ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. నిజానికి గతంలోనూ తాను ఎంపిక చేసిన ఛైర్‌పర్సన్ సీతామహాలక్ష్మి వ్యవహారశైలిపై ఎమ్మెల్యే వనమా సైతం పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవహారశైలి మార్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు సరికదా, ఇంకా తమపై వేధింపులు ఎక్కువయ్యాయన్నది కౌన్సిలర్ల వేదనగా ఉంది. ఇలా అధికారంలో ఉండి కూడా, ఐకమత్యంగా లేకపోవడం వల్లే.. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్‌గా ఒక డీఈఈ స్థాయి దిగువ స్థాయి ఇంజినీరింగ్ అధికారిని ఇన్‌ఛార్జి కమిషనర్‌గా నియమించినా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామన్న నిజాన్ని సైతం వారు ఒప్పుకుంటున్నారు. అయినా మళ్లీ ఒకరిని ఒకరు సహించలేకపోతున్నారని ఓ అధికార పార్టీ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఏడాదికి పైగా నడుస్తున్నా పరిస్థితిలో ఎక్కడా ఎలాంటి మార్పు రాకపోగా, ఇంకా పరిస్థితి దిగజారిపోతున్నదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.
ఇల్లెందు లొల్లి..
తెలంగాణ ఉద్యమకాలంలో ఉవ్వెత్తున ఎగసిన ఇల్లెందులోనూ తెరాసలో వర్గ విబేధాలు రచ్చకెక్కాయి. మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వ్యవహారశైలిని నిరసిస్తూ పదిమంది అధికార పార్టీ కౌన్సిలర్లు రచ్చకెక్కారు. ఏకంగా తమ కౌన్సిల్ ఛైర్మన్ పైన హైకోర్టుకు, రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 23 అంశాలతో కూడిన సుధీర్ఘ లేఖను విడుదల చేశారు. ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు స్వయంగా తానే కొన్ని ప్రసార మాధ్యమాలలో తమ పార్టీకే చెందిన కౌన్సిలర్లకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రచారం చేయించడం పట్ల కౌన్సిలర్లు అలకబూనారు. మహిళా కౌన్సిలర్లతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనకు తన సామాజిక వర్గానికే చెందిన కొందరు అధికార పార్టీ నేతల అండ ఉందన్న ధీమా ఛైర్మన్‌లో వ్యక్తమవుతోందని, వారి అండ చూసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. మహిళా కౌన్సిలర్ల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఒక పనికి సంబంధించిన బిల్లు మంజూరు సమయంలో తనకు కమిషన్ ఇవ్వలేదన్న కారణంగా ఒక కాంట్రాక్టరుపై తన ఛాంబర్‌లోనే దాడి చేశాడని, 1\70 ఏరియాలో అక్రమంగా ఇటుక వ్యాపారం చేస్తున్నారని... బినామి పేర్లతో కాంట్రాక్టు పనులన్నీ తానే చేస్తున్నారని.. అన్ని పనులను తానే చేస్తూ కోట్ల నిధులను కొల్లగొట్టారని ఆరోపించారు. మొత్తం 23 అంశాలతో కూడిన లేఖను కలెక్టర్‌కు, ఇంకా హైకోర్టుకు, రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి లేఖ రాశారు. ఇల్లెందు మున్సిపల్ కౌన్సిలర్లలో 14వ వార్డు కౌన్సిలర్ నంద బిందు, 15 వార్డు కౌన్సిలర్ చీమల సుజాత, 18 వార్డు కౌన్సిలర్ పాబోలు స్వాతి, 19 వార్డు కౌన్సిలర్ పత్తి స్వప్న, 21వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి సరిత, 17వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ జానీ పాషా, 6వ వార్డు కౌన్సిలర్ తోట లలితా శారద, 7వ వార్డు కౌన్సిలర్ సామల మాధవి, 11 వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి శ్రీనివాస్‌లు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Telangana Politics, TRS leaders