Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
పుట్టుక నుండే పాపను వైకల్యం వెంటాడింది. కొన్నాళ్లకే తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయి పాప ఆలనా పాలన వదిలేశారు. దీంతో అమ్మమ్మే అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుతోంది. అయితే, పాప ఆర్యోగం కోసం ఆస్పత్రి ఖర్చులు ఆమెకు భారంగా మారడంతో.. దాతలు ఎవరైనా ఆదుకుని ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలం వేపలగడ్డ గ్రామానికి చెందిన మడకం లక్ష్మి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం కస్తూర్బా బాలికల పాఠశాలలో డైలీవేజ్ వర్కర్గా పనిచేస్తోంది.
తన కూతురు, అల్లుడు వ్యక్తిగత కారణాలతో విడిపోగా మనవరాలు జ్ఞాన శ్రీ (11)ని అన్నీ తానై చూసుకుంటోంది. పుట్టుకతోనే పాప మానసిక, శారీరక వైకల్యంతో జన్మించగా కాళ్లు, చేతులు పని చేయడం లేదు. దీనికి తోడు మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో తన మనవరాలికి అమ్మమ్మ లక్ష్మి అన్ని తానై చూసుకుంటుంది. హైదరాబాదులోని పలు హాస్పిటల్స్ లో కూడా వైద్య చికిత్సలు అందిస్తుంది.మందులు వాడుతూ ఫిజియోథెరపీ చేయిస్తుండడంతో కొంత మార్పు కనిపిస్తోందని, పాప కోలుకుంటుందనే ఆశతో అప్పుచేసి మరీ వైద్యం అందిస్తున్నట్లు లక్ష్మి తెలిపింది.
కొంతకాలం వరకు తను వెళ్లే పని ప్రదేశానికి మనవరాలుని వెంట తీసుకువెళ్లిన లక్ష్మి ప్రస్తుతం ఆ ప్రాంతానికి తీసుకువెళ్లలేని పరిస్థితి. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు కచ్చితంగా ఓ మనిషి పాప పక్కనే ఉండాల్సిన పరిస్థితి. ఉదయం కాలకృత్యాల నుంచి భోజనం తదితర నిత్య జీవితంలోని దయానందిత కార్యక్రమాలు చేసేందుకుగాను, తన మనవరాలి యోగక్షేమాలు చూసుకునేందుకుగాను ఒక్క కేర్ టేకర్ ని సైతం ఏర్పాటు చేసింది.
తనకు నెలకు రూ.9వేల వేతనం అందుతోందని అందులో కేర్ టేకర్ 5000 చెల్లిస్తున్నట్లు లక్ష్మి తెలుపుతుంది. ఇదిలా ఉండగా పాపకు ఫిజియోథెరపీ చికిత్స చేసేందుకు రోజుకి 500 రూపాయల చెల్లించవలసిన పరిస్థితి. అంతేకాక కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తనతో పాటు పాప ఆరోగ్యం కోసం నెలకు రూ.10వేలు వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది.
తనకొచ్చే చాలీచాలని జీతంతో ఇటు తన ఆరోగ్య పరిస్థితి మరోపక్క తన మనవరాలు వైద్య చికిత్స సరైన పద్ధతిలో అందించలేకపోతున్నానని కుమిలిపోతుంది. ఈ నేపథ్యంలో మనవరాలు కోలుకోవాలని కోరుతూ దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. పాప పరిస్థితిని గమనిస్తున్న చుట్టుపక్క ప్రాంత ప్రజలు వారికి తోచిన విధంగా ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీఆశించిన స్థాయిలో చికిత్స మాత్రం లభించడం లేదు.
ఈ నేపథ్యంలో పాప చికిత్స కోసం దాతలు ముందుకు రావాలని పలువురు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయమై దాతలు ఎవరైనా సహాయ సహకారాలు అందించాలనుకుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు. మడకం లక్ష్మి ఫోన్ నంబర్ 9502087430, బ్యాంక్ అకౌంట్ నంబర్ 38046978247, బ్రాంచ్ సారపాక: ఐఎఫ్ఎస్సీ కోడ్ SBIN0021370.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Local News, Telangana