Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
విడువక స్మరించే భగవన్నామం భక్తి ముక్తి దాయకం అని పున పురాణాలు చెబుతున్నాయి. అందుకే కాబోలు అనేక మంది భక్తులు భగవన్నామ స్మరణతో పునీతులయ్యారు. ఆ కోవలోకి చెందిన వారు తూము లక్ష్మీ నరసింహ దాసు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా భక్త రామదాసు భద్రాద్రి దివ్య క్షేత్రం నిర్మించి పూజాది కైంకర్యాలు ప్రారంభించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ భక్త రామదాసుగా కీర్తించబడ్డ కంచర్ల గోపన్న సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అనేక పూజారి కైంకర్యాలు ప్రవేశపెట్టి స్వామివారి సేవలో పునీతులైన మహోన్నత వ్యక్తి తూము లక్ష్మీ నరసింహ దాసు.నాటి కాలంలో తన ఉద్యోగాన్ని సైతం త్రునప్రాయంగా వదిలేసి రామసేవకే అంకితమై అనేక కీర్తనలతో రామున్ని నిత్యం కీర్తించిన మహనీయుడు తూము లక్ష్మీ నరసింహ దాసు.
భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు అత్యంత వైభవంగా స్వామి వారికి దర్బారు సేవ (ప్రభుత్వోత్సవం) ప్రవేశపెట్టిన వ్యక్తి తూము లక్ష్మీ నరసింహదాసు. భద్రాద్రి శ్రీరాముని తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి తూము లక్ష్మీనరసింహదాసు. భద్రాచల రామదాసు కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలాతూము లక్ష్మీనరసింహదాసు వలే జన్మించాడని స్థానికంగా భక్తులు నమ్ముతుంటారు. తూము నరసింహదాసుది గుంటూరు మండలం.తండ్రి అప్పయ్య, తాత వెంకటకృష్ణయ్యలు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు. ఇతడు 1790లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు.
ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుపై పడింది. అందుకోసం పొన్నూరులో పేష్కారుగా పనిచేశాడు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తూము లక్ష్మీ నరసింహ దాసుభారతదేశం అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించాడు. కాలినడకన దాసు కాశీయాత్ర, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించాడు. మహాభక్తుడైన త్యాగరాజు దాసుని ఎదుర్కొని కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పాడు. తరువాత కాంచీపురం, తిరుపతి , అయోధ్య, హరిద్వారం కూడా దర్శించాడు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికార్యాలు కుంటుపడటం బాధ కలిగించింది.
రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కనిపించి హైదరాబాదులో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. అతన్ని కలిసిన నరసింహ దాసును భద్రాచలం, పాల్వంచ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందాడు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు వరద రామదాసు తమ ఐశ్వర్యాన్ని భద్రాద్రి రాముని కైంకర్యానికే వినియోగించారు. భద్రాచలం కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే, నరసింహ, వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావిస్తారు.
ఇంత గొప్ప మహోన్నత వ్యక్తి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 29న దేవస్థానం ప్రాంగణంలో రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana