Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
పూర్తిస్థాయి పరిశీలనతో చేపట్టాల్సిన పనులపై పారదర్శకత కరువై ఉపాధ్యాయుల వేతనాలకు కోత వచ్చి పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ముంపు మండలాల్లో పనిచేసి ఆపై బదిలీపై తెలంగాణ (Telangana) రాష్ట్రానికి వచ్చిన ఉపాధ్యాయులకు సంక్రాంతి పండుగ (Sankranthi Festival) కు ముందు ప్రభుత్వం వేతనాలను నిలిపివేసింది. ఇలా నిలిపివేసిన వేతనాలు గతంలో ముంపు మండలాల్లో పనిచేసిన అందరు ఉపాధ్యాయులకు నిలిపివేశారా? అంటే అందులోనూ కొందరు ఉపాధ్యాయులకు మాత్రమే ఈ జీతాలు నిలుపుదల చేయడంతో ఉపాధ్యాయులలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్రాంతి పండుగ సమీపించడంతో వేతనాల కోసం ఎదురు చూసిన ఉపాధ్యాయులకు ఆ వేతనాలు నిలుపుదల చేయడంతో పాటు సరైన విధి విధానాలు అనుసరించకుండా జరిగిన ఈ తప్పిదాలపై ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) దుమ్ముగూడెం మండలంలో గతంలో ముంపు గ్రామాలలో పనిచేసిన ఉపాధ్యాయులు మొత్తం 47 మంది ఉంటే అందులో 16మంది ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చి 31 మంది వేతనాలు నిలిపివేయడంపై విద్యాశాఖ అధికారి పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014 జూన్ లోఏర్పడింది. అయితే తెలంగాణాకు చెందిన ఎందరో ఉపాధ్యాయులు 2015 జూన్ 23 వరకు ఏడు ముంపు మండలాల్లో విధులు నిర్వహించారు. అక్కడ పనిచేసినంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరు ఉపాధ్యాయులకు నెల నెలా వేతనాలు అందించింది. ఆ తరువాత అక్కడ ఏడు మండలాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , ములుగు, మహబూబ్ నగర్ జిల్లాలకు బదిలీపై వెళ్ళారు.
అయితే 2015 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు వేతనాలు అందించింది. ఇదే క్రమంలో తెలంగాణ సర్కారు కూడా ఈ మూడు మాసాలకు చెందిన జీతం కూడా ఆయా ఉపాధ్యాయులకు అందించింది. కాగా అప్పట్లో రెండు ప్రభుత్వాల నుంచి ఉపాధ్యాయులు రెండు వేతనాలు పొందారు. తెలంగాణ ప్రభుత్వంలో అప్పటి డిడివో అనాలోచితంగా పూర్తిస్థాయి పరిశీలన చేయకుండా వేతనాలు చేయడం, ఎల్పిసిల పరిశీలన చేయకపోవడంతో ఎస్టీవో కూడా వాటిని జారీ చేయడంతో ఈ సమస్య వచ్చిపడినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఆనాడు ఏడు ముంపు మండలాల్లో పనిచేసి తెలంగాణాకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు.
ఇందులో దుమ్ముగూడెం మండలంలో ప్రస్తుతం మొత్తం 47మంది ఉపాధ్యాయులు వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అయితే అందులో అందరూ ఒకే విధమైన విధులు నిర్వర్తించి బదిలీపై వచ్చినప్పటికీ ఇందులో 31మందికి డిసెంబర్ నెల వేతనాలు నిలిపివేసి, మరలా16 మందికి మాత్రం వేతనాల్లో ఎటువంటి కోతలు విధించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొద్ది గొప్పో పలుకుబడి ఉన్న వారికి ఈ అవకాశం కల్పించినట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో రెండుసార్లు వేతనం పొందిన ఉపాధ్యాయులు ఒక నెల వేతనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ అందులో అందరు ఉపాధ్యాయులు ఒకే విధమైన విదులు నిర్వహిస్తే కొందరికే వేతనం నిలిపివేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం) లో ఈ 31 మంది ఉపాధ్యాయుల పేర్లు మాత్రమే తొలగించి జీతాలు నిలిపివేశారు. ఈ సాఫ్ట్వేర్ ఈ నెల 20వ తేదీలోపు మళ్ళీ పేర్లు కలపకపోతే జనవరి నెల జీతం కూడా సకాలంలో అందే పరిస్థితి లేదు. దీంతో పాటు ఎటువంటి సమాచారం లేకుండానే వేతనం నిలిపివేయడంతో ఉపాధ్యాయులు చెల్లించే బ్యాంక్కు ఈఎంఎస్, జీపీఎఫ్, ఏజిపిఎల్ఐ, జీఐఎల్, ఎల్ఐసి తదితర ఎన్నో ప్రీమియంలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సస్పెన్సనకు గురైన ఉపాధ్యాయులకు కూడా ఒకేసారి వందశాతం వేతనాన్ని నిలిపివేసే అవకాశం లేనందున ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కార మార్గాన్ని చూపించాలని జీతం నిలిపివేయబడిన ముంపు ప్రాంత ఉపాధ్యాయులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Teacher, Telangana