హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bhadradri Kothagudem: బూడిదమయం అవుతున్న గోదావరి తీరం

Bhadradri Kothagudem: బూడిదమయం అవుతున్న గోదావరి తీరం

X
రంగుమారుతున్న

రంగుమారుతున్న గోదావరి తీరం

BhadradriKothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద వ్యర్థాలను శుద్ధి చేయకుండా గోదావరిలో కలపడంతో నీళ్లు కలుషితమవుతున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

Kranthi Kumar, News 18, Bhadradri

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద వ్యర్థాలను శుద్ధి చేయకుండా గోదావరిలో కలపడంతో నీళ్లు కలుషితమవుతున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండాసాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీటీపీఎస్ వ్యర్థాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కోసం కోట్లాది రూపాయలు కేటాయించినట్లు ప్రకటించినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.బూడిద వ్యర్థాలను గోదావరిలో కలపడంపై ఇక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బూడిద వ్యర్థాలు కలుస్తున్న ప్రాంతానికి దగ్గరలో మిషన్ భగీరథ పైప్లైన్ తో పాటు కార్మికుల అవసరాల కోసం సింగరేణి సరఫరా చేస్తున్న ట్యాంక్ కూడా ఉండడం ఈ రెండు చోట్ల గోదావరి జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయని గ్రామస్తులు తెలుపుతున్నారు.

సింగరేణి సంస్థ సుమారు 3 వేల కుటుంబాలకు ఈ నీటిని అందిస్తుండగా, మిషన్ భగీరథ ద్వారా మణుగూరు మండలంలోని 10 వేల కుటుంబాలకు ఈ నీరు సరఫరా అవుతోంది. ఈ నీటిని తాగలేక ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నీటిని ఇతరత్రా అవసరాలకు మాత్రమే వాడుతున్నారు. ఈ నీటిని మోటార్ల ద్వారా రైతులు పంటల సాగు కోసం వాడుకుంటుండగా, నీటితో పాటు బూడిద పంట పొలాల్లో చేరి దిగుబడి సైతం తగ్గిపోతుందని ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి రోజు బీటీపీఎస్ నుంచి 6 వేల టన్నుల బూడిద వ్యర్థాలు వెలువడుతున్నాయి. వీటిలోసూమారు 500 టన్నుల బూడిదను లారీల ద్వారా వివిధ అవసరాలకు బయటకు పంపిస్తున్నారు. మిగిలిన సుమారు 5500 టన్నుల బూడిద వ్యర్థాలను నిలువ చేసేందుకు యాష్ పాండ్ లేని కారణంగా 6 నెలలుగా పైప్ లైన్ ద్వారా మద్ది వాగులోకి పంపిస్తున్నారు. అక్కడి నుంచి నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారు.

ఈ సమస్యను అధిగమించేందుకు ఈ ప్రాంతంలో 2 యాష్ పాండ్ లు నిర్మించాల్సి ఉండగా ఒకటి మాత్రమే పూర్తి చేశారు. ఆ యాష్ పాండ్ ఆరు నెలల క్రితమే పూర్తిగా నిండిపోవడం గమనార్హం. వ్యర్థ జలాలను సాగుకు ఉపయోగిస్తున్న రైతులు న్యూస్ 18తో మాట్లాడుతూ.. ఈ నీళ్లు వాడడం వల్ల వరికి దోమపోటు, ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తున్నాయి. బూడిదతో భూములు నిస్సారంగా మారి ఏ పంట వేసినా అడుగు పెట్టే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు.

గోదావరి నీళ్లన్నీ బూడిదతో నిండిపోయి ముట్టుకునే పరిస్థితి లేదని నీరు తాగిన వారికి రోగాలు వస్తున్నాయని ఎవరికి చెప్పినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. బూడిద కుప్పలుగా పేరుకుపోవడంతో నీళ్లు తోడై మోటార్లు తరచూ రిపేర్లకు రావడం, వాటికి మరమ్మతులు చేయించలేక ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. మండలంలోని చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, రామానుజవరం, ధమ్మక్కపేట గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువ ఉన్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు.

బీటీపీఎస్ నుంచి వచ్చే ఈ వ్యర్థాలు గోదావరిలో కలిసే ప్రాంతం మొత్తం బూడిద దిబ్బగా తయారై ఆ ప్రాంతంలో ఉన్న చేపలు చనిపోతున్నాయి. ఈ నీటిని తాగిన పశువులకు చర్మ సంబంధిత రోగాలతో పాటు సొంగ కారుతోందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా బిటిపిఎస్ ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఈ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు.

First published:

Tags: Bhadradri kothagudem, Local News, Telangana

ఉత్తమ కథలు