Dasari Kranthi Kumar, News18.
గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆధ్వర్యంలో నెలకొల్పిన గిరి బజార్లు(సూపర్ మార్కెట్లు) వెలవెలబోతున్నాయి. ఏజెన్సీలోని గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆ ముడి సరుకు ద్వారా వినియోగ వస్తువులను తయారు చేయడం, తేనె ఇతరత్రా వాటిని విక్రయిండంతో పాటు సాధారణ సూపర్ మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల నిత్యావసరాలను అమ్మకాలు సాగిస్తుంటారు. కానీ ప్రస్తుతం సాధారణ నిత్యావసర సరుకులు బయటి మార్కెట్ కంటే తక్కువ ధరలకే లభ్యమవుతున్నప్పటికీ గిరిజన ఉత్పత్తులు మాత్రం లేకుండా పోయాయి.
ఒకప్పుడు భద్రాచలం జిసిసి పాయింట్లో అన్నిరకాల అటవీ అత్పత్తులు లభ్యమయ్యేవి కానీ ఇప్పుడు ఒక్కటంటే ఒక్క ఉత్పత్తి. కూడా లేదు. ఎక్కడైతే ఐటిడిఎలు ఉంటాయో వాటికి అనుసంధానంగా జిసిసి డివిజన్ కార్యాలయాలు ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరులలోని ఐటిడిఎల కేంద్రంగా జిసిసి డివిజన్ కార్యాలయాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రంగా తేనె, భద్రాచలం డివిజన్ కార్యాలయం కేంద్రంగా సబ్బులు, షాంపూలు, ఏటూరు నాగారం కేంద్రంగా వాషింగ్ సోప్ యూనిట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులు ప్రస్తుతం జిసిసి సూపర్ మార్కెట్లలో కానరావడం లేదు.
ప్రధానంగా జిసిసి అటవీ ఉత్పత్తులను చాలా మంది వాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 142 జిసిసి సూపర్ మార్కెట్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అదే విధంగా అలోవీరా సబ్బులు, నీమూ సబ్బులు, టర్మరిక్ సబ్బులు, తేనెతో తయారు సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు కూడా అందుబాటులో లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సూపర్ మార్కెట్లు కళకళాడేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటీవలి కాలం వరకు పలు రకాల జిసిసి ఉత్పత్తులు నిత్యం అందుబాటులో ఉండేవి.
షికాకాయి, కుంకుడు కాయి పౌడర్, షాంపులు, చీపర్లు, పెసర్లు,కందులు, చింతపండు, అలోవీరా సబ్బులు, మారేడు చెక్కరసం, ఉసిరికాయ పొడి, కరక్కాయలు, అరకు కాఫీ పౌడర్ తదితర ఉత్పత్తులు దొరికేవి. ఇప్పుడు అవి కంటికి కూడా కానరావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెందిన ఉత్పత్తులను ఇక్కడికి ఇవ్వడం లేదని, అందుకే షాపుల్లో పెట్టలేకపోతు న్నామని ఇక్కడి జిసిసి వర్గాలు చెబుతున్నాయి. కానీ మన దగ్గర తయారయ్యే తేనెను మాత్రం ఏపి జిసిసికి విక్రయిస్తున్నారు. అటు విక్రయించిన వారు ఇక్కడికి కొనేందుకు ఎందుకు అశ్రద్ధ చూపుతున్నారో అర్ధం కావడం లేదని పలువురు అంటున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులు అందుబాటులో లేక పోవడంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అవి కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరుకు వెళ్లాల్సి వస్తోంది. దూరాభారం కావడంతో వినియోగదారులు మనస్సు మార్చుకుని వేరే ఉత్పత్తులు వాడుతున్నారు. జిసిసి సూపర్ మార్కెట్లో అటవీ అత్పత్తుల నిల్వ లేకున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Forest, Local News, Telangana News