(D. Kranthi Kumar, News18, Bhadradri Kothagudem)
తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి (DGP Mahendar Reddy)బుధవారం భద్రాద్రి జిల్లా మన్యంలో ప్రత్యక్షమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadrari Kothagudem) జిల్లా చర్ల మండలం చెన్నాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ నిర్మాణం పూర్తి కావడంతో బుధవారం తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఐపిఎస్, సీఆర్పీఎఫ్ డీజీపీ కుల్దీప్ సింగ్ ఐపిఎస్‌లు (IPS) హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా చెన్నాపురం (Chennapuram) చేరుకుని అధికారికంగా సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్‌ను (CRPF Base camp) ప్రారంభించారు. ఇద్దరు డీజీపీలతో పాటు అడిషనల్ డీజీపీ ఎస్.ఎస్ చతుర్వేది ఐపిఎస్, సౌత్ జోన్ సిఆర్పిఎఫ్ అడిషనల్ డీజీ నలినీ ప్రభాత్ ఐపిఎస్, సదరన్ సెక్టార్ సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్ చంద్ర లడ్డా ఐపిఎస్, కుంట సీఆర్పీఎఫ్ డిఐజి రాజీవ్ కుమార్ ఠాకూర్, డిఐజి ఎస్.ఎన్ మిశ్రా మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టు (Maoists) వ్యవస్థ నిర్మూలన కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను పటిష్టం చేసేందుకు గాను ప్రత్యేకంగా క్యాంపులను ఏర్పాటు చేస్తుందని అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని చెన్నాపురం, పూసుగుప్ప, ఉంజుపల్లి, చెలిమల, తిప్పాపురం, కలివేరులలో క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లా పోలీసు యంత్రాంగం మరియు సీఆర్పీఎఫ్ బలగాల సమన్వయంతో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
బైక్ చోరీలు: సాధారణ ప్రైవేట్ ఉద్యోగం చేస్తే వచ్చే జీతం విలాసాలకు సరిపోవట్లేదని బైక్ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్, ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలను డూప్లికేట్ తాళంతో చోరీ చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే. చెర్ల మండలం దేవరపల్లి గ్రామంకు చెందిన కారం కృష్ణమూర్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగంలో వచ్చే డబ్బులు తన విలాసాలకు సరిపోకపోవడంతో రాత్రి వేళలో ద్విచక్రవాహనాలను దొంగిలించడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో పోలీసులకు చిక్కాడు కృష్ణమూర్తి. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే మొత్తం 15 ద్విచక్రవాహనాలను దొంగిలించి, కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలానికి చెందిన కేదాసీ రాముకు తక్కువ ధరకు అమ్మినట్లుగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 12 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, DGP Mahendar Reddy, Local News, Maoist