(Kranthi Kumar, News 18, Bhadradri)
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బోగ్ అమలుపై స్థానిక సిబ్బందికి బోగ్ అధికార బృందం శిక్షణ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని రామాలయాన్ని సందర్శించిన జిల్లా ఫుడ్ సేఫ్టీ డెజిగ్నేటెడ్ ఆఫీసర్ డా.చేతన్, కోఆర్డినేటరు డా.ఆంజనేయులు ఖమ్మం ఫుడ్ డెజిగ్నేటెడ్ ఆర్. కిరణ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ అధికారి కిరణకుమార్లు సందర్శించారు. బృందం ముందుగా వంటశాల, అన్నదాన సత్రం, స్టోర్లను సందర్శించి ఆహార ముడిసరుకులను పరిశీలించారు.
అనంతరం దేవస్థానంలో వంటశాల, నిత్యన్నదాన సత్రంలో పని చేసే సిబ్బందికి బోగ్ నిర్వహణ తీరు, ఆవశ్యకత, నాణ్యమైన ఆహారంను ఏ విధంగా సిద్దం చేయాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై డా. ఆంజనేయులు దేవస్థానం సిబ్బందికి వివరించారు. ఈ సమయంలో వారికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం దేవస్థానం ఈవో బి.శివాజీకి లైసెన్సును అధికారికంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ డెజిగ్నేటెడ్ అధికారి డా. చేతన్ అందజేశారు. సిబ్బందికి శిక్షణ అనంతరం పది రోజుల తరువాత మరోసారి క్షేత్రస్థాయిలో బోగ్ బృందం పర్యటించాల్సి ఉంది. అయితే జనవరి 1, 2 తేదీల్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవాల దృశ్య ఉద్యోగులంతా విధుల యందు బిజీలో ఉండటంతో దేవస్థానం అధికారులు ఉత్సవాల అనంతరం కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు.
దీంతో బోగ్ అధికారుల బృందం ఇందుకు అంగీకరించింది. జనవరి నెలలో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం ఇందుకు సంబంధించిన సమాచారంను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఫెసాయ్) ఢిల్లీలోని ఉన్నతాధికారులకు నివేదించనున్నారు. ఆ బృందం జనవరి చివరి వారంలో భద్రాద్రి దేవస్థానంను సందర్శించి పరిస్థితులను పరిశీలించి బోగ్ సర్టిఫికెట్ జారీ చేస్తుందని జిల్లా ఫుడ్ సేఫ్టీ డెజిగ్నేటెడ్ ఆఫీసర్ డా. చేతన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవ స్థానం పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, టెంపుల్ ఇన్స్పెక్టరు వాసు, రాము పాల్గొన్నారు. భక్తులకు పరిశుభ్ర వాతావరణంలో ప్రసాదాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భగవంతునికి ఆనందకరమైన పరిశుభ్రమైన నైవేద్యాన్ని అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'భోగ్' పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆరు ఆలయాల్లో భోగ్ అమలుకు రాష్ట్ర ఫుడ్ కమిషనర్ శ్వేత మహంతి చర్యలు తీసుకున్నారు.
కమిషనర్ ఆదేశాల మేరకు యాదాద్రి, వేములవాడ, కొమరవెల్లిలో దేవస్థానాల్లో ఇప్పటికే ఈ తరహా పద్ధతిని అమల్లోకి తీసుకురాగా, తాజాగా భద్రాచలం, బాసర దేవస్థానాల్లోనూ అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానాన్ని సైతం భోగ్ పరిధిలోకి తీసుకురానుండడంతో దేవస్థానం అధికారులు ఆ రకంగా సంసిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే లైసెన్సు కోసం దరఖాస్తు చేయగా రాష్ట్ర ఉన్నతాధికారులు లైసెన్సును జారీ చేశారు. ఈ లైసెన్సును అధికారికంగా దేవస్థానం అధికారులకు అందజేయనున్నట్లు రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Local News, Telangana