(G.SrinivasReddy,News18,Khammam)
అక్కడ మరి కాసేపట్లో భాజాభజంత్రీలు మోగాల్సి ఉంది. జీలకర్రబెల్లం.. తాళిబొట్టు.. తలంబ్రాలతో పెళ్లి మండపం(Wedding hall)సందడి చేయాల్సి ఉంది. వచ్చి పోయే బంధువుల పలకరింపులు.. కొత్తచుట్టాల పరిచయాలు..షడ్రుచులతో భోజనాలు.. ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాల్సిన ఉన్నా అప్పటికప్పుడు రణరంగంగా మారింది. రక్తపాతం జరిగింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. తలలు పగిలాయి. రక్తం చిందింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రి(Hospital)కి తీసుకెళ్లాలన్న ప్రయత్నం వృధా అయింది. విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేశారు. కొట్లాటలో నిమగ్నమైన అక్కడి గుంపులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గొడవను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. ఎంత సేపు ప్రయత్నించినా ఫలితం రాకపోయేసరికి.. కనీసం గాయపడిన వాళ్లకు వైద్య సహాయం అందించడానికి తన వాహనంలో క్షతగాత్రులను తీసుకెళ్తున్న ఎస్సై వాహనాన్ని(SI vehicle) సైతం అడ్డుకున్నారు. వాళ్లను కాపాడడానికి వీళ్లేదంటూ.. వైద్యం చేయిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. నచ్చచెప్పడానికి ప్రయత్నించిన ఎస్సై పైన సైతం దాడికి ప్రయత్నించారు. నెట్టేశారు. పెళ్లి మండపం కాస్తా రణరంగంగా మారిన ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kottagudem)జిల్లా ఇల్లెందు(Yellandu)లో చోటుచేసుకుంది.
పెళ్లి జరగబోయే ముందే ఫైటింగ్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండాకు చెందిన తునగర్ శంకర్, చింతమ్మల కుమార్తె పార్వతికి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అప్పరాజుపల్లికి చెందిన ముండావర్ శంకర్, సత్యమ్మల కుమారుడు విజయ్‌తో వివాహం నిశ్చయమైంది. మే నెల 12న మధ్యాహ్నం వివాహ కార్యక్రమం కోసం వరుడు, తన బంధువులతో సహా బొంబాయితండాకు చేరుకున్నారు. మరికాసేపట్లో పెళ్లి తంతు ప్రారంభం అవుతుందనగా పెళ్లికొడుకు తరపున వచ్చిన బంధువులకు, స్థానికులైన బొంబాయితండాలోని కొందరికి గొడవ మొదలైంది. అదికి చినికి చినికి పెద్దదైంది. ఘర్షణగా మారింది. పరస్పరం దాడులకు దిగారు. విపరీతంగా కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో పెళ్లికొడుకు బంధువులకు తలలు పగిలాయి. రక్తం చిందింది.
పోలీసుల్ని లెక్కచేయని పెళ్లివారు..
డయల్ 100 ద్వారా విషయం తెలుసుకున్న కొమురారం ఎస్సై రమణారెడ్డి తన సిబ్బందితో వచ్చి గొడవను సర్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. ఎంతసేపు చెబుతున్నా వినిపించుకోకపోవడంతో.. కనీసం గాయపడిని వారిని రక్షించడానికి పూనుకున్నారు. రక్తమోడుతున్న వారిని తన వాహనంలో ఎక్కించుకుని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఎస్సై ప్రయత్నాన్ని సైతం అడ్డుకున్న స్థానికులు అతనిపైనా దాడికి ప్రయత్నించారు. ఒకదశలో అతన్ని నెట్టిపారేశారు. ఏడెనిమిది మంది తోసుకొచ్చి మరీ ఎస్సైపైన దాడికి పూనుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి తమపై దాడికి పాల్పడిన వారిని ఎలా రక్షిస్తారని ప్రశ్నిస్తూ పోలీసుల పైకి దౌర్జన్యంగా దాడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది రౌండ్‌గా ఏర్పడి ఎస్సైని పక్కకు తప్పించగలిగారు. పెళ్లి మండపంలో గొడవకు పెద్దగా కారణాలు తెలియకపోయినా.. మద్యం పంపిణీ వద్ద ఇరువర్గాలు మాటామాట పెంచుకున్నట్టు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.