రిపోర్టర్ : క్రాంతి
లొకేషన్ : భద్రాద్రి
నిత్యం వ్యవసాయ పనిలో బిజీగా ఉండే రైతులు వారికి అవసరమైన పనిముట్లు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి కొనడం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ పనిముట్ల కోసం పట్టణ ప్రాంతాలకు వెళ్లి కొంటుంటారు. వాటిని మరమ్మత్తులు చేసేందుకు సైతం పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితే. ఈ నేపథ్యంలో తమ ప్రాంతాల్లో ఉపాధి లేక వందలాది కిలోమీటర్లు వలస వచ్చి రైతులకు అవసరమైన పనిముట్లను తయారు చేయడం, రైతుల వద్ద ఉన్న పాత పనిముట్లకు మరమ్మత్తులు చేసి ఉపాధి పొందుతున్నారు ఉత్తర భారతదేశానికి చెందిన పలు వలస కుటుంబాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో పలు ప్రాంతాలకు ప్రతి ఏటా రాజస్థాన్ , మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు కుటుంబాలు వలస వస్తాయి.
మూడు నుంచి నాలుగు నెలల పాటు ఏజెన్సీ వ్యాప్తంగా పలు గ్రామ గ్రామాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని ఆయా ప్రాంతాల్లో ఉన్న రైతులకు అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లను తయారు చేయడం, పాత వ్యవసాయ పనిముట్లకు మరమ్మత్తు చేయడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా రైతుల పంట పొలాలకు అవసరమే కత్తులు, కొడవళ్ళు, గొడ్డళ్లు తయారు చేయడంలో వీళ్లు సిద్ధహస్తులు.క్షణాల్లో ఇనుమును తమకు నచ్చిన ఆకృతిలో మలిచి పనిముట్లు తయారు చేయడం వీళ్ళ ప్రత్యేకత.
భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ఏజెన్సీలో నివాసం ఉండే గిరిజన ప్రాంతానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పనిముట్లు కొనేందుకు,వాటిని మరమ్మతు చేయించేందుకు భద్రాచల పట్టణానికి రావాల్సిందే. ఈ తరుణంలో ప్రతి ఏడాది భద్రాచలంలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ పనిముట్ల తయారీ, మరమ్మతులు చేస్తున్న ఈ వలస తయారీదారుల రాక కోసం గిరిజన ప్రాంత ప్రజలు ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇనుప వస్తువులను తయారు చేస్తున్న తయారీదారులను న్యూస్ 18 పలకరించగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సంచరిస్తుంటాం.
వ్యవసాయ పనిముట్లను తయారు చేస్తూ విక్రయిస్తాం. మా వద్దే రైతులు పరికరాలు కొనుగోలు చేస్తుంటారు. దీంతో రోజుకు సుమారు రూ. 1000/-వరకు సంపాదిస్తున్నాం. మా ప్రాంతాల్లో సరైన ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గత్యంతరం లేక వలస బాట పట్టినా మమ్మల్నిఇక్కడి ప్రజలు, రైతులు మమ్మల్ని ఆదరిస్తున్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు చూస్తుంటే మేము కూడా తెలంగాణలో పుడితే ఎంత బాగుండు అనిపిస్తున్నదని వాళ్ల మనసులో మాటను వ్యక్తీకరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana