(G.SrinivasReddy,News18,Khammam)
తల్లిపాలు సృష్టిలో అత్యంత శ్రేష్టమైనవి. స్వచ్ఛమైనవి. ఆరోగ్యకారకమైనవి. పొత్తిళ్లలో ఉన్నప్పుడు తల్లి పట్టే పాలలో ఉండే ఎంజైములు బాల్యంలోనే కాదు ఆ బిడ్డ 60ఏళ్ల వయసు వచ్చే వరకు పని చేస్తుంటాయనేది డాక్టర్ల మాట. మరి అంతటి ప్రాధాన్యం కలిగిన తల్లిపాలను చంటిబిడ్డలకు పట్టించడానికి ప్రభుత్వం ఇప్పటికే తల్లిపాల వారోత్సవాల పేరుతో అవగాహన కల్పిస్తోంది. ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను రూపొందించింది. అయినప్పటికి ప్రజల్లో మార్పు పెద్దగా కనిపించకపోవడంతో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మదర్ మిల్క్ బ్యాంక్(Mother Milk Bank)లను సైతం ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రు(Government Hospital)ల్లో సహజ కాన్పుల(Natural delivery)ను ప్రోత్సహిస్తున్న సర్కారు ఆసుపత్రుల్లో మదర్ మిల్క్ బ్యాంక్‌లను నెలకోల్పడం శుభపరిణామంగానే చూడాలి. మొదటగా హైదరాబాద్(Hyderabad)లోని నీలోఫర్(Nilofer)ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వరంగల్(Warangal)లో...ఇప్పుడు ఖమ్మం (Khammam)ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్‌ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
బిడ్డకు తల్లిపాలే శ్రేష్టం..
పుట్టిన ప్రతి ఒక్క శిశువుకూ తల్లి పాలు అవసరం. బిడ్డకు అమృతతుల్యమైన ఈ తల్లిపాల లభ్యత అందరు తల్లుల్లో ఒకలా ఉండదు. కొందరికి అవసరం మేర తల్లిపాలు లభిస్తాయి. మరికొందరికి అసలు లభ్యం కావు. ఇంకొందరి శిశువు అవసరానికి మించి లభ్యం అవుతాయి. ఇలా శిశువు ఆకలి తీరగా మిగిలిన పాలను ఆసుపత్రుల్లోనే సేకరిస్తారు. అలాగే డెలివరీ అయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తల్లులు కూడా స్వచ్ఛందంగా తల్లిపాలను ఇవ్వొచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డ ఆకలి తీరగా మిగిలిన పాలు స్తనాల్లో ఉండిపోయి స్తనాలు విపరీతంగా నొప్పులు పుట్టడం, దీనికోసం ప్రత్యేకంగా మందులు వాడే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తల్లులు పాలను డొనేట్ చేయొచ్చనే ఉద్దేశంతోనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మదర్ మిల్క్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మదర్‌మిల్క్ బ్యాంక్ ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యపేట జిల్లాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండనుంది.
అమ్మపాల బ్యాంకు..
ఇలా సేకరించిన పాలను ప్రత్యేక శీతలీకరణ ప్రక్రియలో నిల్వ ఉంచుతారు. తల్లిపాలను నలభై రోజుల నుంచి ఆరు నెలల వరకు భద్రపరిచే అవకాశం ఉంది. ఇలా నిల్వ ఉంచిన పాలను తల్లిపాలు లభ్యం కాక అవసరమైన శిశువులకు అందిస్తారు. సరైన ఆరోగ్యం లేకుండా పుట్టిన శిశువులను నియోనాటల్ విభాగంలో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పిల్లలకు ఈ తల్లిపాల బ్యాంకు నుంచి పాలను అందిస్తారు. బిడ్డ పెరుగుదల, ఆరోగ్యం బాగా ఉండాలంటే తల్లిపాలు పట్టాలన్న నినాదాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తల్లిపాల లభ్యత లేని పిల్లలకు వాటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చొరవ చూపింది. తెలంగాణలో ఇది మూడో తల్లిపాల బ్యాంకు కావడం విశేషం.దేశంలో తొలి తల్లి పాల బ్యాంకును 1989లో ముంబై సియోన్‌లోని లోకమాన్య తిలక్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. తల్లిపాలు లభ్యం కాని అనేక మంది శిశువులకు ఈ బ్యాంకు వరంలా మారింది. దీంతో ఈ స్ఫూర్తిని తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలోనూ ఈ మదర్ మిల్క్ బ్యాంకుల ఏర్పాటుకు చొరవ చూపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Mother milk