Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
దక్షిణ అయోధ్యగా విరాజుల్లుతున్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో (Bhadrachalam Temple) ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొనిభద్రాద్రి రామయ్యకు వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలను అత్యంత వైభవోపేతంగా శాస్త్రీయతంగా నిర్వహించారు దేవాలయ అర్చక స్వాములు. ఈ నేపథ్యంలో ముందుగా బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో కలశాభిషేకం పూర్తిచేసి సహస్రధారతో స్నపనం జరిపించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఊయలపై శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామి వారిని ఆశీనులను చేశారు. అనంతరం ఆస్థాన గాయకులు రామదాసు కీర్తనలను ఆలపిస్తుండగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఊయలలో సీతా లక్ష్మణ సమేతంగా ఆసీనులైన శ్రీరామచంద్రమూర్తికి నక్షత్ర హారతి సమర్పించారు.
ఆర్చకులు శ్రీ సీతారాములపై రంగులు చల్లి వసంతోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రధాన ఆలయంలోని మూల విరాట్ కు లక్ష్మీ తాయారు అమ్మవారు ఆంజనేయ స్వామి వారిపై వసంతాన్ని చల్లి శాస్త్రీయతంగా వసంతోత్సవాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులపై అర్చకులు, సిబ్బంది పసుపునీళ్లు, రంగులు చల్లారు. ఈ సందర్భంగా బేడా మండపం రంగుల మయంగా మారింది. ఆలయ సిబ్బంది సైతం ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకున్నారు. ఇదిలా ఉండగాడోలోత్సవం సందర్భంగా తొలుత ఉత్సవమూర్తులకు 25 కలశాల పంచామృతాలతో ప్రత్యేక స్నపనం నిర్వహించి.. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అందంగా అలంకరించిన ఊయలలో సీతారామ లక్ష్మణులను ఆసీనులను చేసి డోలోత్సవం నిర్వహించారు.
ఈ సమయంలో అస్థాన హరిదాసులు రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలు ఆలపిస్తుండంతో రామాలయ ప్రాంగణమంతా భక్తి పార్వశంతో ఓలలాడింది. నక్షత్ర, కుంభ హారతులను స్వామివారికి సమర్పించారు. ఇదిలా ఉండగాహోలీ పండుగ సందర్భంగా స్వామివారికి వసంతోత్సవాన్ని నిర్వహించారు. భద్రాద్రి రామయ్యకు వసంతం చల్లిన రోజున స్వామివారిని పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసినట్లుగా భక్తులు భావిస్తారు. వాస్తవానికి చైత్ర శుద్ధ పంచమి రోజు శాస్త్రోక్తంగా స్వామివారిని పెళ్లికుమారుడిని చేస్తారు. వసంతోత్సవం సందర్భంగా ముందుగా ప్రధాన ఆలయంలోని ధృవమూర్తులకు, ఆంజనేయస్వామికి, లక్ష్మీతాయారు అమ్మవారికి వసంతాన్ని చల్లారు.
అనంతరం వసంతోత్సవానికి చిహ్నంగా భక్తులపై పసుపు నీళ్లను జల్లారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు తిరువీధిసేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఆర్డీవో రత్నకల్యాణి, న్యాయమూర్తి నీలిమ, భద్రాద్రి దేవస్థానం ఏఈవోలు శ్రావణ్ కుమార్, భవానీ రామకృష్ణారావు, ఇంజనీరింగ్ విభాగం ఈఈ వి.రవీంద్రనాధ్, దేవస్థానం స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్, పరిపాలన వెదిక సిబ్బంది పాల్గొన్నారు. రామాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్న సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రాచలం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలను చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana