Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (Bhadrachalam Temple) లో స్వామివారి వసంతపక్షపయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి కల్యాణ గడియలు దగ్గర పడుతుండటంతో భద్రాచలం పట్టణమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా భద్రాచలం దేవస్థానంలో గరుడ పట ధ్వజారోహణాన్నిశాస్త్రిక్తంగా నిర్వహించారు అర్చక స్వాములు.గరుడ పట ధ్వజారోపరాన్ని పురస్కరించుకొని ముందుగా ప్రధాన ఆలయంలోని బేడా మండపంలోఉత్సవ మూర్తుల ఎదుట అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాన్ని అర్చకులు దిగ్విజయంగా నిర్వహించారు. అనంతరం గరుడ పటాన్ని మేళతాళాలతో, మంగళవాయిద్యాలు నడుమ వేద మంత్రోచ్చారణల మధ్య ఉత్సవ మూర్తుల సాక్షిగా ఆలయ ధ్వజస్తంభంపై ఎగురవేశారు.
శ్రీమహావిష్ణువునకు అత్యంతప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంకేతంగా అటు సకల దేవతలకు, ఇటు మానవజాతికి తెలిపేలా గరుడపట ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు. అలాగేఅష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలకు ఆహ్వానించే భేరి పూజ కార్యక్రమాన్ని ఆచార్యులు వైభవంగా నిర్వహించారు.
గరుడ పట ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుని పేరన గరుడ ముద్దలు ప్రసాదాన్ని అర్చకులు మహిళలకు పంపిణీ చేయడం భద్రాచల దేవస్థానంలో ఆనమయితిగా వస్తున్న అంశం. ఈ గరుడ ముద్ద ప్రసాదాన్ని స్వీకరించిన సంతానం లేని మహిళలకు, రుగ్మతలతో బాధపడే మేలు జరుగుతుంది అనేది స్థానిక భక్తుల నమ్మకం. స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే గరడ ముద్దలు పంపిణీ చేసే కార్యక్రమం ఉండడంతో మహిళలు పెద్ద ఎత్తున దేవస్థానానికి చేరుకొని గరుడ ముద్దలను స్వీకరించారు.
ఇదిలా ఉండగా తెల్లని వస్త్రంపై గరుత్మంతుడి చిత్రాన్ని చిత్రీకరించి జీయర్ మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భాజభజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య రామా లయానికి ధ్వజాన్ని తీసుకెళ్లారు. మంగళవారం ధ్వజారోహణం నిర్వహిస్తున్న క్రమంలో గరుత్మంతుడి చిత్రపటానికి గరుడాధివాసాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సమయంలో గరుత్మంతుడిని ఆవాహన చేసి గరుడ సంబంధమైన స్థానంలో మూర్తి ఆవాహన నిర్వహించారు. అంతకుముందు రామయ్య సన్నిధానం వద్దకు తీసుకెళ్లి చిత్ర లేఖనంలో తెలిసి తెలియక ఏమైనా దోషాలు ఉంటే స్వామి చల్లని చూపులతో ఆ దోషాలను తొలగించి ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా ప్రార్ధించారు.
అనంతరం యాగశాలలో ధ్వజపటాన్ని తీసుకెళ్లి అదివాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో గరుత్మంతుడి చిత్ర పటానికి హారతి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గరుత్మంతుడి చిత్రాన్ని చిత్రీకరించిన కె. రఘునాథాచార్యులను అభినందిస్తూ స్వామి వారి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్. రమాదేవి, దేవనాథ రామానుజ జీయర్ స్వామి, వైదిక, పరిపా లన సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana