Dasari Kranthi Kumar, News18, Bhadradri Kothagudem
ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం (Bhadradri Temple) పై శీతకన్ను వేస్తోంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.100 కోట్ల నుంచి మొదలు పెడితే నేటి వరకు కనీసం ఒకటంటే ఒకటి కూడా అభివృద్ధి పని జరగకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయం కాస్త పక్క పక్కనబెడితే భద్రాద్రి దేవస్థానంలో వరుస వివాదాలు సైతం చుట్టూ మూడుతున్నాయి. సదరు దేవస్థానంలో ప్రముఖంగా జరిగే ఉత్సవాలలో ఒకటైన ముక్కోటి ఏకాదశి బ్రహ్మోత్సవాలలో తయారుచేసిన లడ్డూలను మిగిలిపోవడంతో వాటిని అలానే భక్తులకు ఇవ్వడం దానిపై కేసు నమోదవడం.. ఆఖరికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కల్పించుకొని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం.. నలుగురు ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్న తరుణంలో అసలు దేవస్థానం పరిపాలన విభాగం పనితీరుపై విమర్శలు వెలుగుతున్నాయి.
సరిగ్గా ఇక్కడే ట్రస్ట్ బోర్డు ఆవశ్యకత గురించి చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయడంపై దృష్టి సారించక పోవడం వల్లే కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు రామభక్తులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. దేశంలోనే రెండవ అయోధ్యగా కీర్తింపబడుతున్న ఆలయంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో పాటు నిత్యం ఉద్యోగులకు అవినీతి, అక్రమాల మరకలు కూడా అంటుతున్నాయి. ఇంత జరుగుతున్నాపట్టించుకునే వారు కరువయ్యారు. 1960 సంవత్సరంలో ఈ దేవస్థానం ఎండోమెంట్ పరిధిలోకి వెళ్లగా నాటి నుంచి 2012 వరకు 13 ట్రస్ట్ బోర్డులు ఏర్పడ్డాయి. 2012లో ఏర్పడ్డ ట్రస్ట్ బోర్డు 2014 వరకు సేవలు అందించగా నాటి నుంచి నేటి వరకు భద్రాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు లేకుండానే పరిపాలన సాగుతుంది.
ఇప్పటి వరకు కల్లూరి చంద్రమౌళి, బండి శోభనాచలం, యతిరాజారావు, అల్లూరి మూర్తిరాజు (రెండుసార్లు), ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, కోనేరు నాగేశ్వరరావు, బోర్ల వెంకటేశ్వరరరావు, కత్తుల శాంతయ్య, కొండబాల కోటేశ్వరరావు, తాళ్లూరి. వెంకటేశ్వరరావు, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, కురిచేటి పాండురంగారావు ట్రస్టు బోర్డు చైర్మన్లు గా పని చేశారు. వీరు భద్రాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ లుగా వ్యవహరించిన సమయంలోఈ దేవస్థానం కాస్తో కూస్తో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు.
ఏడాదికి సుమారు 60 కోట్ల వరకు వార్షిక ఆదాయం ఉండే ఈ దేవస్థానంలో ఉద్యోగుల మాట ఇటు ఉంచితే కాంట్రాక్టర్లు సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. గడచిన పదేళ్లగా దేవస్థానం లడ్డు తయారీ కాంట్రాక్ట్ ఒకే సంస్థకు చెందిన వారు నిర్వహిస్తుండడం గమనించదగ్గ విషయం. అధికార పార్టీ నేతల అండదండలతో ఆయన చెప్పిందే వేదవాక్కుగా దేవస్థానంలో జరుగుతుందని ఉద్యోగులే బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు.
ఇటు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా అటు నిత్యం వివాదాలమయమవుతున్న దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి పరిపాలనను గాడిలో పెట్టవలసి అవసరం ఎంతైనా ఉంది. ట్రస్టు బోర్డు ఉండడంతో అనేక లాభాలున్నాయని పలువురు రామభక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా బోర్డు సమావేశమై భక్తులకు అవసరమైన సౌకర్యాల కోసం అభివృద్ధి పనులపై తీర్మానం చేస్తారు. కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి అప్రూవల్ తీసుకొని వెంటనే పనులు చేయిస్తారు. ఇప్పుడు భక్తులకు అవసరమైన సౌకర్యాల కోసం ఈవో సిఫార్సు చేసినా కమిషనర్ నుంచి అనుమతి వచ్చేంత వరకు ఆగాల్సిందే.
ట్రస్టు బోర్డు లేకపోవడం వల్ల ఈవో తీసుకునే నిర్ణయాలు సకాలంలో అమలు కావడం లేదు. 100 ఎకరాల్లో చేపట్టిన శ్రీ గోకుల రామమ్ పనులు ఆక్రమణదారుల అడ్డగింతలతో ఆగిపోయాయి. కమిటీ ఉంటే దీనిపై సీరియస్ రియాక్షన్ ఉండేది. పూర్తిగా విరాళాలతో చేపట్టిన ఈ పనులకు చాలా మంది దాతలు ముందుకొచ్చేవారు. టీటీడీ భక్తుల కోసం నిర్మించిన కాటేజీని దేవస్థానానికి అప్పగించలేదు. రూ. 6 కోట్లతో నిర్మించిన ఈ కాటేజీ ఏళ్లుగా ఖాళీగా ఉంటోంది. బోర్డు ఉంటే ఒత్తిడి తెచ్చి భక్తుల కోసం వినియోగించేవారు. ఆఫీసర్ల పర్యవేక్షణపై నిత్యం బోర్డు సమీక్షిస్తుంది. నిఘా ఉంటుంది. ఇప్పుడు అది లేదు. దీంతో పాలను పక్కదారి పడుతోందనే విమర్శలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrachalam, Bhadradri kothagudem, Local News, Telangana